Share News

Nirmala Sitharaman: రక్షణ బడ్జెట్‌ తగ్గించలేదు!

ABN , Publish Date - Feb 03 , 2025 | 05:03 AM

2024-25లో రక్షణ బడ్జెట్‌ రూ.6.22 లక్షల కోట్లు ఉండగా.. కొత్త బడ్జెట్‌లో రూ.6.81 లక్షల కోట్లకు (9.53%) పెంచారు. అయితే ఇది చాలా తక్కువని విమర్శలు వస్తు న్న నేపథ్యంలో నిర్మల ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. రక్షణ బడ్జెట్‌ ప్రత్యేకతను అర్థం చేసుకోవాలన్నారు.

Nirmala Sitharaman: రక్షణ బడ్జెట్‌ తగ్గించలేదు!

ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు చెల్లింపులు ఉన్నప్పుడే పెంపు: నిర్మల

మన రక్షణ ఎగుమతులూ పెరిగాయ్‌ 25 వేల కోట్లు ఆర్జించాం: ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఈ దఫా బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులు సంతృప్తిగా లేవన్న వాదనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చారు. 2024-25లో రక్షణ బడ్జెట్‌ రూ.6.22 లక్షల కోట్లు ఉండగా.. కొత్త బడ్జెట్‌లో రూ.6.81 లక్షల కోట్లకు (9.53ు) పెంచారు. అయితే ఇది చాలా తక్కువని విమర్శలు వస్తు న్న నేపథ్యంలో నిర్మల ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. రక్షణ బడ్జెట్‌ ప్రత్యేకతను అర్థం చేసుకోవాలన్నారు. రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఒక ఏడాదిలో ఆర్డర్‌ ఇచ్చినప్పుడు.. ఆ ఏడాదిలోనే చెల్లింపులు జరపాల్సి ఉంటుందని.. అప్పుడు తప్పనిసరిగా కేటాయింపులు పెంచుతూ వస్తున్నామని తెలిపారు. ఈ చెల్లింపులు దీర్ఘకాలిక ప్రాతిపదికన ఉంటాయన్నారు. ‘రక్షణ వ్యయంలో కోతపెట్టలేదు. పైగా పెన్షన్లు, కొనుగోలు వ్యయాలు తగ్గకుండా చూస్తున్నాం. సైనిక విభాగాలు కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల్లో 60శాతం దేశీయంగా తయారుచేసినవే. దీన్ని గుర్తించాలి. అయితే వేరే దేశం (రష్యా) నుంచి భారీఎత్తున రక్షణ ఉత్పత్తులు కొనడం వేరే విషయం. రోజువారీ వినియోగించాల్సినవి, ఇతర ఉత్పత్తులను మన దేశం నుంచే కొంటున్నాం. ఆయుధ వ్యవస్థలను ఎగుమతి కూడా చేస్తున్నాం. విదేశాలకు ఎగుమతుల ద్వారా వస్తున్న ఆదాయం తాజాగా రూ.25 వేల కోట్లు దాటింది’ అని వివరించారు. కాగా.. చైనా, పాకిస్థాన్‌ల నుంచి పొంచి ఉన్న సవాళ్ల నేపథ్యంలో నూతన ఆయుధ వ్యవస్థలు కొనాలని సాయుధ బలగాలు అభిలషిస్తున్నాయి. ఈ క్రమంలో రూ.6.8 లక్షల కోట్ల తాజా రక్షణ బడ్జెట్‌లో ఇందుకోసం రూ.1.8 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. ఈ మొత్తంతో ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఇతర సైనిక సామగ్రి కొననున్నారు. నిజానికి భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.9 శాతం రక్షణ బడ్జెట్‌కు కేటాయిస్తున్నారు. నిరుడు రూ.6.2 లక్షల కోట్లు కేటాయించినా ఖర్చు మాత్రం రూ.6.41 లక్షల కోట్లకు చేరినట్లు సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు.


మోదీ సరే.. అధికారులు ససేమిరా!!

ఆదాయ పన్ను పరిమితిని రూ.12 లక్షలకు పెంచేందుకు ప్రధాని మోదీ సంపూర్ణ మద్దతు తెలియజేశారని.. అయితే అధికారులు మాత్రం ఇందుకు అంగీకరించలేదని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ‘పన్ను రేట్లు తగ్గించాలని ప్రధాని స్పష్టతతో ఉన్నారు. మా ఆర్థిక శాఖ యంత్రాంగానికి నచ్చజెప్పి ఈ ప్రతిపాదనపై ముందుకెళ్లాం. పన్ను వసూలు సామర్థ్యంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఒప్పించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది’ అని తెలిపారు. పన్ను రేట్ల తగ్గింపు వల్ల ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో రూ.లక్ష కోట్లు, పరోక్ష పన్నుల రాబడిలో రూ.2,600 కోట్లు నష్టం వచ్చే అవకాశమున్నా ప్రభుత్వం ముందుకెళ్లడం గమనార్హం. ప్రధాని వివిధ వర్గాల ప్రజలు చెప్పేది నిత్యం ఆలకిస్తుంటారని.. అణగారిన వర్గాలు.. ప్రత్యేకించి గిరిజనులతో కూడా మాట్లాడుతుంటారని.. వారందరితో సంభాషించి సమాచారం సేకరిస్తారని నిర్మల వెల్లడించారు.

Updated Date - Feb 03 , 2025 | 05:40 AM