Share News

Nimisha Priya Petition: యెమెన్‌లో కేరళ నర్సు మరణ శిక్ష నిలుపుదల కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్.. త్వరలో విచారణ

ABN , Publish Date - Jul 10 , 2025 | 01:15 PM

యెమెన్‌‌లో కేరళ నర్సు మరణ శిక్ష నిలుపుదల కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మరణ శిక్ష అమలు నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సేవ్ నిమిష ప్రియ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.

Nimisha Priya Petition: యెమెన్‌లో కేరళ నర్సు మరణ శిక్ష నిలుపుదల కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్.. త్వరలో విచారణ
Nimisha Priya

ఇంటర్నెట్ డెస్క్: యెమెన్‌లో కేరళ నర్సు నిమిష ప్రియకు విధించిన మరణ శిక్ష నిలుపుదల కోసం దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. జులై 14న పిటిషన్‌పై విచారణ జరపనుంది. 2017లో ఓ యెమెన్ దేశస్థుడి హత్య కేసులో నిమిషను దోషిగా తేల్చిన అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. జులై 16న శిక్షను అమలు చేస్తారన్న వార్తల నడుమ సుప్రీం కోర్టులో సేవ్ నిమిష ప్రియ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది (Nimisha Priya Supreme Court Petition).

ఈ పిటిషన్‌పై అత్యవసర ప్రాతిపదికన విచారణ కోసం సీనియర్ అడ్వకేట్ ఆర్ బసంత్ చేసిన విజ్ఞప్తిపై జస్టిస్ సుధాన్షూ ధూలియా, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్జీ సానుకూలంగా స్పందించారు. జులై 14న విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. దౌత్య మార్గాల ద్వారా ఆమె విడుదలకు కేంద్రం ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. షరియా చట్టం ప్రకారం, బాధిత కుటుంబానికి నిందితులు బ్లడ్ మనీ కింద కొంత పరిహారాన్ని చెల్లించి కేసు నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ దిశగా చర్చలకు కేంద్ర చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.


ఏమిటీ కేసు

ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నర్సు స్వస్థలం కేరళలోని పాలక్కాడ్. కుటుంబానికి అండగా ఉండేందుకు ఆమె 2008లో యెమెన్‌కు వెళ్లారు. అక్కడ స్థానికుడైన తలాల్ అబ్దో మెహదీతో కలిసి ఓ క్లినిక్ ప్రారంభించారు. ఆ తరువాత ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. మీడియా కథనాల ప్రకారం, ఆర్థిక విషయాల్లో ప్రియతో వివాదాలు తలెత్తడంతో మెహదీ ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నాడు. దీన్ని తిరిగి పొందే క్రమంలో మెహదీకి మత్తు మందు ఇచ్చినట్టు ప్రియపై అభియోగాలు నమోదయ్యాయి. ఇదే అతడి మరణానికి కారణమని అక్కడి కోర్టు తేల్చింది. అయితే, మెహదీ చేతిలో ప్రియ అనేక వేధింపులకు గురయ్యిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు.


ఈ కేసులో ప్రియను దోషిగా తేలుస్తూ 2020లో సనాలోని ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ కూడా సమర్థించింది. గతేడాది, యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమీ మరణ శిక్ష అమలుకు ఆమోదం తెలిపారు. అయితే, మెహదీ కుటుంబం బ్లడ్ మనీని స్వీకరించి ప్రియకు క్షమాభిక్ష పెట్టేందుకు అంగీకరిస్తేనే మరణ శిక్ష రద్దు సాధ్యపడుతుంది.

ఇవి కూడా చదవండి:

ట్రంప్‌పై మండిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు

భారీ షాకిచ్చిన ట్రంప్.. ఏకంగా 50 శాతం సుంకం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 01:37 PM