Share News

NIA Probe on Pahalgam Attack: పహల్గాం దాడిపై ఎన్‌ఐఏ విచారణ.. వెలుగులోకి కీలక విషయాలు

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:33 AM

పహల్గాంపై ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు ఈ నరమేధాన్ని తమ కెమెరాల్లో రికార్డు చేసినట్టు గుర్తించారు.

NIA Probe on Pahalgam Attack: పహల్గాం దాడిపై ఎన్‌ఐఏ విచారణ.. వెలుగులోకి కీలక విషయాలు
NIA Probe Reveals Body Cams use by Terrorist in Pahalgam attack

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడిపై విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరం చేసింది. కుట్ర మూలాలను వెలికితీసేందుకు ఆధారాల సేకరణతో పాటు ప్రత్యక్ష సాక్షులను కూడా ప్రశ్నిస్తోంది. దాడి జరిగిన వెంటనే దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ కేసు నమోదు చేశాక దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పాలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెర్రరిస్టులు తమ దుస్తులకు ధరించిన కెమెరాతో తమ అకృత్యాన్ని రికార్డు చేసుకున్నట్టు తేల్చింది.

దాడి జరిగిన రోజునే తాము దర్యాప్తు ప్రారంభించినట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక పోలీసుల సాయంతో విచారణ ప్రారంభించింది. బైసరన్ మైదానంలోకి ఉగ్రవాదులు ఏయే మార్గాల్లో చొచ్చుకొచ్చి, పారిపోయారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.


ఈ దాడిలో 5 నుంచి 7 మంది ఉగ్రవాదులు పాల్గొని ఉండొచ్చని ఎన్‌ఐఏ అధికారులు భావిస్తున్నారు. వారికి ఇద్దరు స్థానికులు సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. వీరు పాకిస్థాన్‌లో శిక్షణ పొంది ఉంటారని అంటున్నారు. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు పాక్ ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా రేఖా చిత్రాలను భద్రతా దళాలు విడుదల చేశాయి. ఐజీ, డీఐజీ, ఎస్పీ సారథ్యంలోని బృందాలు ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్నాయి.

ఏప్రిల్ 22న జరిగిన ఈ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది మరణించారు. వీరిలో దాదాపు అందరూ పర్యాటకులే. ఆర్టికల్ 370 తరువాత కాశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది. అయితే, ఈ దాడిలో ఎంతమంది మృతి చెందారనే దానిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.


దాడి తరువాత రంగంలోకి దిగిన భద్రతా దళాలు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే 14 మంది టెర్రరిస్టుల పేర్లను విడుదల చేశాయి. ఆ ప్రాంతంలో మొత్తం 40 నుంచి 50 మంది టెర్రరిస్టులు ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నాయి. పాక్ ప్రోద్బలంతో ఈ దాడి జరగడంతో భగ్గుమన్న భారత్ దాయాది దేశంపై కఠిన చర్యలకు దిగిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

రాక్షసత్వం ప్రబలితే.. పహల్గాం దాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ రియాక్షన్

అదే జరిగితే సింధూ నదిలో వారి రక్తం పారుతుంది.. బిలావాల్ భుట్టో పిచ్చి కూతలు

అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య

Read Latest and International News

Updated Date - Apr 28 , 2025 | 11:37 AM