NCERT: విభజన భయానక పరిస్థితులపై ఎస్‌సీఈఆర్‌టీ పాఠం.. విభేదించిన కాంగ్రెస్
ABN , Publish Date - Aug 16 , 2025 | 06:25 PM
విభజనకు ఒక వ్యక్తి మాత్రమే కారణం కాదని, ముగ్గురు వ్యక్తుల పాత్ర ఉందని తెలిపింది ఎన్‌సీఈఆర్‌టీ. ఒకరు విభజనకు పట్టుబట్టిన జిన్నా, రెండవది విభజనకు అంగీకరించిన కాంగ్రెస్, విభజనను అమలు చేసిన లార్డ్ లూయీస్ మౌంట్ బాటన్ మూడో వ్యక్తని తెలిపింది.
న్యూఢిల్లీ: దేశ విభజన నాటి భయంకరమైన పరిస్థితులను (Partition Horrors) వివరిస్తూ జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (NCERT) పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసింది. ఏటా ఆగస్టు 14న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 'విభజన గాయాల స్మారక దినం' గురించి ఇందులో ప్రస్తావించింది.
ముగ్గురు వ్యక్తులు
1947 నాటి దేశ విభజనకు ఒక వ్యక్తి మాత్రమే కారణం కాదని, ముగ్గురి పాత్ర ఉందని తెలిపింది. ఒకరు విభజనకు పట్టుబట్టిన జిన్నా, రెండవది విభజనకు అంగీకరించిన కాంగ్రెస్, విభజనను అమలు చేసిన లార్డ్ లూయీస్ మౌంట్ బాటన్ మూడో వ్యక్తని తెలిపింది. విభజన కారణంగానే భారత్‌కు కశ్మీర్ ఒక భద్రతా సమస్యగా మారిందని, అప్పటి నుంచి మన పొరుగున ఉన్న ఒక దేశం ఈ సమస్యను చూపించి వివిధ మార్గాల ద్వారా భారత్‌పై ఒత్తిడి తీసుకువస్తోందని పేర్కొంది.
1940 లాహోర్ రిజల్యూషన్‌ను కూడా జాతీయ విద్యా పరిశోధన సంస్థ ఇందులో ప్రస్తావించింది. హిందూ-ముస్లింలు రెండు భిన్నమైన గ్రామాలు, సిద్ధాంతాలు, సామాజిక కట్టుబాట్లు, సాహిత్యానికి చెందిన వారని మహమ్మద్ అలీ జిన్నా అందులో పేర్కొన్నారని తెలిపింది. బ్రిటిషర్లు తొలుత అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్) ఇవ్వడం ద్వారా భారత్‌ను కలిపి ఉంచాలనే ఆలోచన చేసినప్పటికీ ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తోసిపుచ్చిందని వివరించింది.
విభజనపై గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ అభిప్రాయాలను కూడా ఈ పాఠంలో పొందుపరిచారు. ఇండియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా పేలడానికి సిద్ధంగా ఉందని సర్దార్ వల్లభాయ్ పటేల్ పేర్కొన్నట్టు తెలిపింది. ఇండియా యుద్ధరంగంగా మారనున్నందున అంతర్యుద్ధానికి దారితీయడానికి బదులు విభజన జరగడమే మెరుగని పటేల్ అభిప్రాయపడ్డారని పేర్కొంది. గాంధీ వైఖరిని ప్రస్తావిస్తూ, విభజనలో పాలుపంచుకునేందుకు గాంధీ ఇష్టపడనప్పటికీ కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆపలేకపోయినట్టు తెలిపింది. విభజనకు నెహ్రూ, పటేల్ అంగీకరించడంతో 1947 జూన్ 14న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయనను ఒప్పించగలిగిందని తెలిపింది. అధికారాల బదిలీని ముందుగానే చేపట్టిన లార్డ్ మౌంట్‌బాటన్‌ను ఈ మాడ్యూల్ తీవ్రంగా వ్యతిరేకించింది. 1948 జూన్‌లో అధికార బదిలీ జరుగుతుందని మౌంట్ బాటన్ ముందుగా ప్రకటించారని, అయితే దానికంటే ముందుగానే 1947 ఆగస్టుకు దీనిని తీసుకువచ్చారని తెలిపింది. హడావిడిగా సరిహద్దుల పునర్విభజన వల్ల అనేక చోట్ల ఆగస్టు 15వ తేదీ నాటికి కూడా తాము ఇండియాలో ఉన్నామో పాకిస్థాన్‌లో ఉన్నామో ప్రజలకు తెలియలేదని పేర్కొంది. కాగా, ఎన్‌సీఈఆర్‌టీ రెండు మాడ్యూల్స్‌లో ఒకటి 6-8 తరగతలకు మరొకటి 9-12 తరగతులు వర్తింపజేయనున్నారు.
కస్సుమన్న కాంగ్రెస్
ఎన్‌సీఈఆర్‌టీ కొత్త మాడ్యూల్‌పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. చరిత్రలో జరిగిన వాస్తవాలను వక్రీకరించారని, వీటిని తగులబెట్టాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం
రూ.11,000 కోట్లతో హైవే ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి