Share News

Mumbai Rain: ముంబైపై కుంభవృష్టి

ABN , Publish Date - May 27 , 2025 | 05:11 AM

ముంబైలో 107 ఏళ్ల రికార్డు సాధించిన 295 మిల్లీమీటర్ల భారీ వానలు పడగా, నగరం నీట మునిగింది. మహారాష్ట్రతోపాటు కేరళ, కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Mumbai Rain: ముంబైపై కుంభవృష్టి

295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు.. 107 ఏళ్లలో ఇదే తొలిసారి

నీటమునిగిన పలుప్రాంతాలు.. రైలు, మెట్రో, బస్సు సర్వీసుల రద్దు

మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వర్షాలు.. కేరళ, కర్ణాటకలోనూ వానలు

ముంబై, మే 26: ముంబై నగరాన్ని సోమవారం భారీవానలు ముంచెత్తాయి. రుతుపవనాలు ప్రవేశించిన తొలిరోజే ఏకంగా 295 మిల్లీమీటర్ల వాన కురిసిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ)కి చెందిన కొలాబా అబ్జర్వేటరీ వెల్లడించింది. ఇది గత 107 ఏళ్లలోనే రికార్డు. ఇంతకుముందు 1918లో ముంబైలో 279.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవటం ఇదే తొలిసారి. సాధారణ వానలు కురిస్తేనే తడిసిముద్దయ్యే నగరం.. ఈ కుంభవృష్టితో నీట మునిగింది. పలు రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాంలు నీటిలో మునిగిపోయి ఉండటం, ఎస్కలేటర్ల పైనుంచి వరద కిందికి పడటం వంటి దృశ్యాలతో కూడిన వీడియోలు పరిస్థితికి అద్దం పట్టాయి. పలుచోట్ల సబర్బన్‌ రైలు సర్వీసులను, మెట్రో రైళ్లను, బస్సులను అధికారులు నిలిపివేశారు. కొన్ని చోట్ల సర్వీసులను దారి మళ్లించి నడిపారు. రోడ్ల మీద చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

hyl.jpg

ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీగా వానలు కురిశాయి. బారామతి, ఇందాపూర్‌, పుణెల్లో పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరింది. ఇందాపూర్‌ సమీపంలో పుణె-సోలాపూర్‌ జాతీయ రహదారి నీట మునిగి ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


వర్షబీభత్స ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. రాయ్‌గఢ్‌ జిల్లాలో పిడుగు పడిన ఘటనలో ఒక వ్యక్తి మరణించారు. ముంబైకి సాధారణంగా రుతుపవనాలు జూన్‌ 11వ తేదీన చేరుకుంటాయి. కానీ, ఈసారి 16 రోజుల ముందుగానే వచ్చేశాయి. ఇలా జరగటం గత 75 ఏళ్లలో ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్త సుష్మానాయర్‌ తెలిపారు. భారీవర్షాల నేపథ్యంలో ముంబైతోపాటు థానె, రాయ్‌గఢ్‌ జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రుతుపవనాల ప్రభావంతో కేరళ, కర్ణాటకల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. కేరళలోని త్రిసూర్‌, వయనాడ్‌, పాలక్కాడ్‌, కొజికోడ్‌ జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. నదులు ఉప్పొంగుతుండటంతో సమీపప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కర్ణాటక తీరప్రాంతంలో వరుసగా మూడోరోజైన సోమవారం కూడా వానలు భారీగా కురిశాయి. సులియా జిల్లాలోని బెల్లారెలో 200.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కర్ణాటక తీరప్రాంతానికి ఇప్పటికే జారీ అయిన రెడ్‌ అలర్ట్‌ మరో ఐదురోజులపాటు అమలులో ఉంటుందని ఐఎండీ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 05:11 AM