Newborn Abandoned In Forest: కన్నతల్లి కర్కశత్వం.. 19 రోజుల పసికందు పెదాలు అతికించి..
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:58 PM
గొర్రెల కాపరి చిన్నారి అరుపులు విన్నాడు. వెంటనే అరుపులు వినపడుతున్న చోటుకు వెళ్లాడు. పాపను చూసిన వెంటనే పోలీసులు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు.
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి కన్న ప్రేమను మర్చిపోయి కర్కశంగా ప్రవర్తించింది. 19 రోజుల బిడ్డ పెదాలు గమ్‌తో అతికించి అడవికి తీసుకెళ్లి వదిలేసింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన వివరాల మేరకు.. బిల్వారాకు చెందిన ఓ మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది. 19 రోజుల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఈ విషయం మహిళ తండ్రికి తెలిసింది. అక్రమ సంబంధం కారణంగా బిడ్డ పుట్టిందని తెలిస్తే పరువు పోతుందని భావించాడు.
పసికందును వదిలించుకోవడానికి కూతుర్ని ఒప్పించాడు. ఇద్దరూ కలిసి ఓ ప్లాన్ వేశారు. రెండు రోజుల క్రితం బుండి ప్రాంతానికి వచ్చారు. ఫేక్ ఐడెంటిటీతో ఓ రూము అద్దెకు తీసుకున్నారు. పసికందును అక్కడ వేరే వాళ్లకు అమ్మడానికి ప్రయత్నించారు. అయితే, చిన్నారిని అమ్మటం కుదరలేదు. దీంతో ఓ దారుణమైన నిర్ణయానికి వచ్చారు. పాపను ఊరి బయట ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. చిన్నారి ఏడవకుండా ఉండాలని నోట్లో రాయి పెట్టి, పెదాలను గమ్‌తో అతికించారు. తర్వాత అడవిలో వదిలేసి వెళ్లిపోయారు.
అయినా బిడ్డ ఏడుపు బయటకు వినిపించసాగింది. అటు వైపు వచ్చిన గొర్రెల కాపరి చిన్నారి అరుపులు విన్నాడు. వెంటనే అరుపులు వినపడుతున్న చోటుకు వెళ్లాడు. పాపను చూసిన వెంటనే పోలీసులు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాపను రక్షించారు. ఆస్పత్రికి తలించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో తండ్రీకూతుళ్ల గురించి తెలిసింది. ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పసికందు ఆ మహిళ కూతురా? కాదా? అని తేల్చడానికి డీఎన్ఏ పరీక్షలు చేయించారు. పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
అన్ని పార్టీలతో సఖ్యతగానే ఉన్నాం.. ఏ కూటమి నుంచీ ఆహ్వానం రాలేదు
నాటు తుపాకీతో కోడిని కాల్చేందుకు యత్నం.. తూటా తగిలి యువకుడి మృతి