Pahalgam attack: మోదీపై చిదంబరం థరూర్ ప్రశంసలు
ABN , Publish Date - May 12 , 2025 | 05:22 AM
పహల్గాం ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం కట్టుదిట్టంగా, కానీ పరిమితంగా ప్రతిస్పందించడాన్ని కాంగ్రెస్ నేతలు చిదంబరం, శశిథరూర్ ప్రశంసించారు. విస్తృత యుద్ధాన్ని నివారించి దేశ ప్రయోజనాలను కాపాడటం మోదీ తెలివైన నిర్ణయమని వారు అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ, మే 11: పాకిస్థాన్ విషయంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు ఊహించని వర్గాల నుంచి కూడా మద్దతు వెల్లువెత్తుతోంది. పహల్గాం ఉగ్రదాడిపై భారత సైన్యం ప్రతిస్పందనను ఎంచుకున్న లక్ష్యాల వరకే పరిమితం చేయడం చాలా తెలివైన నిర్ణయమని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ కాల్పుల విరమణ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. విస్తృత యుద్ధం వల్ల కలిగే ముప్పును మోదీ గుర్తించారన్నారు. మరిన్ని ప్రాణాలు పోకుండా నివారించేందుకు ఇది అవసరమైన నిర్ణయమని పేర్కొన్నారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారకుండా మోదీ తెలివిగా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ‘ఇది బాధిత దేశం చట్టబద్ధమైన ప్రతిస్పందన’ అని చిదంబరం పేర్కొన్నారు. సరిహద్దు అవతలి నుంచి కాల్పుల వల్ల కొందరు భారతీయుల ప్రాణాలు పోవడం బాధాకరమంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. భారత యుద్ధ విమానాన్ని కూల్చేశామని పాకిస్థాన్ చెప్పడాన్ని వృథా ప్రేలాపనగా కొట్టిపారేశారు. పారదర్శకత కోసం ఆపరేషనల్ విజువల్స్‌ను భారత్ విడుదల చేయడం, ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించే కార్యక్రమంలో ఇద్దరు యువ మహిళా అధికారులను భాగస్వాములను చేయడాన్నీ చిదంబరం ప్రశంసించారు. అయితే, పహల్గాం ఘటన అనంతరం అఖిలపక్షానికి మోదీ హాజరుకాకపోవడాన్ని చిదంబరం విమర్శించారు.
కాగా, పహల్గాం ఉగ్రదాడిపై భారత ప్రభుత్వ ప్రతిస్పందన లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 1971లో ఇందిరాగాంధీ హయాంలో సాధించిన ఘన విజయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంపై ఒక ఆంగ్ల వార్తా సంస్థ ప్రశ్నించగా శశిథరూర్ ఈ విధంగా స్పందించారు. బంగ్లాదేశ్ ప్రజలకు విమోచనం కలిగించడం నాటి లక్ష్యమన్నారు. అయితే ఇప్పటి పరిస్థితులు వేరన్నారు. సుదీర్ఘ యుద్ధంతో దేశం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టలేమని పేర్కొన్నారు. ‘చెప్పాలనుకున్న గుణపాఠం పూర్తయింది. దీర్ఘకాల ఘర్షణ ఉద్దేశం భారత్‌కు లేదు. భారత్ ఎప్పుడూ దీర్ఘకాల యుద్ధాన్ని కోరుకోలేదు. వాస్తవం ఏమిటంటే 1971 నాటి పరిస్థితులు, 2025 నాటి పరిస్థితులు ఒకటి కాదు. వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మనం కొనసాగించాలనుకున్నది యుద్ధం కాదు. కేవలం ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలనుకున్నాం. చెప్పేశాం’’ అన్నారు.
Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్