Share News

PM Modi: నీతిమాలిన వాళ్లు!

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:14 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్‌ విడుదల కాకముందే ప్రధాని మోదీ ప్రచార భేరి మోగించారు. మాజీ సీఎం, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

PM Modi: నీతిమాలిన వాళ్లు!

అన్నా హజారేను ముందుపెట్టి వంచించారు

కేజ్రీవాల్‌ బృందంపై ప్రధాని ఫైర్‌

న్యూఢిల్లీ, జనవరి 3: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్‌ విడుదల కాకముందే ప్రధాని మోదీ ప్రచార భేరి మోగించారు. మాజీ సీఎం, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు ‘నీతిమాలిన’ వ్యక్తులు గాంధేయవాది అన్నా హజారేను ముందుపెట్టి ప్రజలను వంచించారని ధ్వజమెత్తారు. మోదీ శుక్రవారమిక్కడ అశోక్‌విహార్‌లోని స్వాభిమాన్‌ అపార్ట్‌మెంట్స్‌లో జేజే క్లస్టర్స్‌కు చెందిన మురికివాడ ప్రజలకు కొత్తగా నిర్మించిన 1,675 ఫ్లాట్ల తాళాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా రామ్‌లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆప్‌ నేతలపై విరుచుకుపడ్డారు. నీతే లేని కొందరు గత పదేళ్లుగా దేశ రాజధానిని ‘ఆప్‌’ద పాల్జేశారన్నారు. ‘వీళ్లు ఢిల్లీ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు. కానీ ఈ ‘ఆప్‌’, ఈ ‘ఆప్‌’ద ఢిల్లీని చుట్టుముట్టింది. దీని నుంచి రాజధానిని విముక్తి చేసేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఆప్‌ ప్రభుత్వం తొలుత అవినీతికి పాల్పడుతుంది.

jkl.jpg

తర్వాత దానిని గొప్పగా సమర్థించుకుంటుంది. మొదట చోరీకి పాల్పడి తర్వాత అహంకారం ప్రదర్శిస్తుంటారు. మద్యం స్కాం, స్కూల్‌ స్కాం, కాలుష్య కుంభకోణానికి పాల్పడ్డారు. బహిరంగంగా అవినీతికి పాల్పడుతూ.. పైగా ప్రచారం చేసుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు. కేజ్రీవాల్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రజాధనంతో తన నివాసాన్ని అద్దాల మహల్‌గా మలచుకోవడాన్ని మోదీ ఎద్దేవాచేశారు. ‘నేను కూడా అద్దాల మహల్‌ కట్టుకోగలను. కానీ మోదీ తన సొంతానికి ఇల్లు కట్టుకోలేదని.. 4 కోట్ల మందికిపైగా పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చాడని దేశానికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని మురికివాడల ప్రజలకు ఇవాళ కాకపోయినా రేపైనా పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానని.. ఇది తన మాటగా వారందరికీ చెప్పాలని సభకు హాజరైనవారికి పిలుపిచ్చారు. ఇళ్ల లబ్ధిదారులతో ఆయన సంభాషించారు. ఈ సందర్భంగా నౌరోజీనగర్‌లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, సరోజినీనగర్‌లో జనరల్‌ పూల్‌ రెసిడెన్షియల్‌ అకామడేషన్‌ (జీపీఆర్‌ఏ) టైప్‌-2 క్వార్టర్స్‌, ద్వారకలో సీబీఎ్‌సఈ కార్యాలయ సముదాయం సహా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వీరసావర్కర్‌ కాలేజీ, తూర్పు, పశ్చిమ క్యాంప్‌సలలో అకడమిక్‌ బ్లాకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

10లక్షల సూట్‌.. 8,400 కోట్ల విమానం: కేజ్రీ

మోదీ వ్యాఖ్యలను కేజ్రీవాల్‌ తిప్పికొట్టారు. రూ.2,700 కోట్ల ఖర్చుతో ఇల్లు కట్టుకుని.. రూ.10 లక్షల విలువ చేసే సూట్‌ వేసుకుని.. రూ.8,400 కోట్ల ఖరీదు చేసే విమానంలో తిరిగే వ్యక్తి నోట అద్దాల మహల్‌ ప్రస్తావన శోభిల్లదన్నారు. పదేళ్లలో కేంద్రం ఢిల్లీకి చేసిందేమీ లేదని.. అయినా తమ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు.

Updated Date - Jan 04 , 2025 | 05:14 AM