PM Modi: మా నినాదం అందరి వికాసం
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:23 AM
ప్రతిపక్షాలు కుటుంబ పార్టీలంటూ ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అందరి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. ‘సబ్‌కా వికాస్.. సబ్‌కా వికాస్’ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుంటే.. అధికార కాంక్షతో విపక్షాలు తమ కుటుంబాలను ప్రోత్సహించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు.

వారికి కుటుంబమే సర్వస్వం.. విపక్షాలపై ప్రధాని ఆగ్రహం
వారాణసీలో రూ.3,880 కోట్ల పథకాలకు శంకుస్థాపన
వారాణసీ, ఏప్రిల్ 11: ప్రతిపక్షాలు కుటుంబ పార్టీలంటూ ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అందరి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. ‘సబ్‌కా వికాస్.. సబ్‌కా వికాస్’ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుంటే.. అధికార కాంక్షతో విపక్షాలు తమ కుటుంబాలను ప్రోత్సహించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. యూపీలోని తన నియోజకవర్గం వారాణసీలో శుక్రవారం ఆయన పర్యటించారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టాక ఇది ఆయనకు 50వ అధికారిక పర్యటన. ఈ సందర్భంగా రూ.3,880 కోట్ల విలువ చేసే 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలేకు నివాళులర్పించారు. 2036 ఒలింపిక్ క్రీడలు మన దేశంలో నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మోదీ వారాణసీలో అడుగుపెట్టగానే.. ఇటీవల తన నియోజకవర్గంలో 19 ఏళ్ల యువతిపై జరిగిన గ్యాంగ్‌రే్‌పపై ఆరా తీశారు. పోలీసు కమిషనర్, డివిజనల్ కమిషనర్, కలెక్టర్ వివరాలు తెలియజేశారు. 23 మంది నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రధాని ఆదేశించారు.