PM Modi: ‘బ్రహ్మోస్’తో పాక్‌కు నిద్ర లేని రాత్రులు
ABN , Publish Date - May 31 , 2025 | 05:33 AM
బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చాయని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత సైనిక శక్తిని యావత్ ప్రపంచం కళ్లారా చూసిందని చెప్పారు.
ఉగ్ర, వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేసిన క్షిపణులు
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు
ఉగ్రవాద పాము మళ్లీ పడగ విప్పితే తొక్కేస్తాం
బిహార్, యూపీ పర్యటనలో ప్రధాని మోదీ
కాన్పూర్, మే 30: బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చాయని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత సైనిక శక్తిని యావత్ ప్రపంచం కళ్లారా చూసిందని చెప్పారు. జమ్మూకశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి మన బలగాలు దీటుగా బదులిచ్చాయని, పాక్‌లోని ఉగ్రవాదులకు తగిన గుణపాఠం నేర్పాయని తెలిపారు. శుక్రవారం మోదీ బిహార్, యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయడంతో పాటు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రూ.47,600 కోట్ల విలువైన 15 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రక్షణ రంగంలో పెద్దపెద్ద కంపెనీలు ఉత్తరప్రదేశ్‌కు వస్తున్నాయన్నారు. అమేఠీలో ఏకే203 రైఫిల్ తయారీ ప్రారంభమైందని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. మన అక్కచెల్లెళ్ల సిందూరాన్ని తుడిచివేసిన ఉగ్రమూకల పీచమణిచామని, పాక్‌లోని వాళ్ల స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత స్వదేశీ ఆయుధ శక్తి ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను మన క్షిపణి వ్యవస్థలు ధ్వంసం చేశాయన్నారు.
బ్రహ్మోస్ క్షిపణులు.. శత్రువులకు నిద్రలేని రాత్రులను మిగిల్చాయని మోదీ చెప్పారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. స్వదేశీ ఆయుధ సామర్థ్యం, మేకిన్ ఇండియా శక్తిని ఇది ప్రపంచానికి చూపించింది. పాకిస్థాన్‌లో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రస్థావరాలను కూడా నాశనం చేశాం. మన ఆయుధాలు, క్షిపణులు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి శత్రువులను వణికించాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు. బ్రహ్మోస్ క్షిపణులతో తమ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించిన నేపథ్యంలో ప్రధాని మోదీ మన క్షిపణుల గొప్పతనం గురించి ప్రస్తావించడం గమనార్హం. అంతకుముందు ఆయన బిహార్‌లోని కారకత్‌లో రూ.48,520 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఉగ్రవాదం పాములాంటిదని.. మళ్లీ పడగ విప్పితే ఏ కలుగులో దాక్కున్నా బయటికి లాక్కొచ్చి దాన్ని తొక్కి చంపేస్తామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ భారత అమ్ములపొదిలోని ఓ బాణం మాత్రమేనని చెప్పారు. భారత సైన్యం దాడులతో దిగివచ్చిన పాకిస్థాన్.. యుద్ధాన్ని ముగించాలంటూ వేడుకుందని చెప్పారు. అణ్వాయుధ బెదిరింపులకు భారత్ భయపడదని, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోదని తేల్చిచెప్పారు.
శుభం ద్వివేది కుటుంబ సభ్యులకు ప్రధాని పరామర్శ
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కాన్పూర్ వాసి శుభం ద్వివేది(31) కుటుంబాన్ని ప్రధాని మోదీ శుక్రవారం పరామర్శించారు. మోదీని చూడగానే కుటుంబ సభ్యులు బోరున ఏడ్చారని, వారికి ప్రధాని ధైర్యం చెప్పారని మృతుడి బంధువు సౌరభ్ తెలిపారు. ప్రధాని కూడా భావోద్వేగానికి గురయ్యారన్నారు. ఏడో తరగతి చదువుతున్న శివన్య తివారీ అనే బాలిక గీసిన ‘ఆపరేషన్ సిందూర్’ చిత్రపటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వీకరించారు. సభా వేదికపై నుంచి ఆ బాలిక గీసిన చిత్రపటాన్ని చూసిన మోదీ, దానిని తీసుకురావాలని తన భద్రతా సిబ్బందికి సూచించారు. అలాగే ఆ చిత్రపటంపై బాలిక పేరు, చిరునామా రాయమని అడిగారు. ఆమెకు తానే స్వయంగా ఒక లేఖ పంపుతానని హామీ ఇచ్చారు.