Mann Ki Baat: యువతపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:34 PM
తాజా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ యువతపై ప్రశంసలు కురిపించారు. యువత పట్టుదల దేశానికి అతిపెద్ద శక్తి అని అన్నారు. నవంబర్ నెలలో జరిగిన పలు స్ఫూర్తిమంతమైన ఘటనల గురించి కూడా ప్రధాని పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన 128వ ఎడిషన్ మన్-కీ-బాత్ రేడియో కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా యువతరంపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. యువత స్ఫూర్తిమంతమైన చర్యల్ని ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇస్రో డ్రోన్ కాంపిటీషన్‌లో జెన్-జీ యువత కనబరిచిన పట్టుదలను పేర్కొన్నారు (PM Modi Mann Ki Baat).
అంగారక గ్రహంలో ఎదురయ్యే పరిస్థితుల్లో పనిచేయగలిగే డ్రోన్స్ కోసం ఇస్రో ఈ కాంపిటీషన్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక టీమ్‌కు పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలినా లెక్కచేయక పట్టుదలగా ప్రయత్నించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘గాల్లోకి లేచిన డ్రోన్స్ కొంతసేపటి వరకూ స్థిరంగా ఉండేవి. ఆ తరువాత కింద పడిపోయేవి. వాటికి జీపీఎస్ సపోర్టు లేకపోవడంతో ఇలా జరిగేది. అంగారక గ్రహంపై జీపీఎస్ ఉండదు. కాబట్టి అవి కేవలం కెమెరా, ఇన్‌బిల్ట్ సాఫ్ట్‌వేర్ సాయంతో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది’ అని ఆయన వివరించారు.
ఇలా పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడ్డ పుణె టీమ్ ఒకటి చివరకు పోటీలో విజేతగా నిలిచిందని ప్రధాని తెలిపారు. వికసిత్ భారత దేశానికి యువత పట్టుదలే అతిపెద్ద బలమని ప్రధాని వ్యాఖ్యానించారు. యువత దృఢ చిత్తం, పోరాటపటిమకు దేశ ప్రగతి ప్రతిబింబమని అన్నారు.
నవంబర్ నెలలో దేశంలో వెలుగుచూసిన ఎన్నో అంశాలు తనకు స్ఫూర్తినిచ్చాయని ప్రధాని మోదీ చెప్పారు. జాతిని జాగృతం చేసిన వందేమాతరం గీతం రచించి నవంబర్‌లో 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఇంజన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఓ) కేంద్రం కూడా ఓ మైలురాయి అని వ్యాఖ్యానించారు. మాహే నౌకను నావికాదళంలో ప్రవేశపెట్టడం, స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభం కావడం భారతీయ సృజనాత్మకతకు, యువత శక్తికి నిదర్శనమని ప్రధాని వ్యాఖ్యానించారు.
గత పదేళ్లల్లో ధాన్యం ఉత్పత్తి 100 మిలియన్ టన్నుల నుంచి 357 మిలియన్ టన్నులకు పెరగడం వ్యవసాయ రంగంలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ క్రీడా రంగంలో తన సత్తా ప్రపంచవ్యాప్తం చేస్తోందని అన్నారు. మనసులో పట్టుదల, వైఫల్యాలను తట్టుకుని నిలబడగలిగే ధైర్యం ఉంటే విజయం తప్పక సాధిస్తామని ప్రధాని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇండిగో ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి
బీఎల్ఓల పరిహారం రెట్టింపు.. ఈసీ నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి