Amit Shah on Naxals: నక్సల్స్ వ్యవస్థ నిర్మూలించే వరకూ విశ్రమించం: అమిత్ షా
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:59 PM
నక్సల్స్ లొంగిపోతే మంచిదని, లేదంటే వాళ్లని పట్టుకునే లేదా నిర్మూలించే వరకూ ఆగబోమని అమిత్ షా తేల్చి చెప్పారు. నక్సల్స్ అణచివేత వల్ల పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న 6.5 కోట్ల మంది ప్రజల జీవితాల్లో కొత్త సూర్యోదయం..
ఛత్తీస్‌గఢ్: దేశంలో నక్సల్స్ వ్యవస్థను నిర్మూలించే వరకూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విశ్రమించదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నక్సల్స్ లొంగిపోతే మంచిదని, లేదంటే వాళ్లని పట్టుకునే లేదా నిర్మూలించే వరకూ ఆగబోమని అమిత్ షా తేల్చి చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్ట కొండపై 'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్'ను విజయవంతంగా నిర్వహించినందుకు భద్రతా బలగాలను అమిత్ షా అభినందించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), కోబ్రా బెటాలియన్ల సిబ్బందిని ఆయన సత్కరించారు. భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు.
'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్' సమయంలో జవాన్లు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమం నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా గుర్తుండిపోతుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. అడుగడుగునా వేడి, విపరీత వాతావరణ, భౌగోళిక పరిస్థితుల్ని ఎదుర్కొని భద్రతా దళాలు ధైర్యంతో ఆపరేషన్ నిర్వహించి ఒక ప్రధాన నక్సల్ బేస్ క్యాంప్‌ను విజయవంతంగా ధ్వంసం చేశాయని అమిత్ షా కొనియాడారు. కర్రెగుట్ట కొండపై స్థాపించబడిన లెఫ్ట్ వింగ్ తీవ్రవాదుల (LWEs) మెటీరియల్ డంప్, సరఫరా చైన్ ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు, CRPF, DRG, CoBRA సిబ్బంది ధైర్యంగా ధ్వంసం చేశారని చెప్పారు.
పాఠశాలలు, ఆసుపత్రులను మూయించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకోవడం ద్వారా దేశంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో నక్సల్స్ తీవ్ర నష్టం కలిగించారని కేంద్ర హోం మంత్రి అన్నారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల కొనసాగింపు కారణంగా, పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకూ విస్తరించి ఉన్న 6.5 కోట్ల మంది ప్రజల జీవితాల్లో 'కొత్త సూర్యోదయం' వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో తీవ్రంగా గాయపడిన భద్రతా సిబ్బందికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. మార్చి 31, 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News