Share News

PM Modi Calls NDA A Natural Alliance: ఎన్డీయే సహజ కూటమి

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:45 AM

ఎన్డీయే సహజ కూటమి. మిత్రపక్షాల సామూహిక గుర్తింపునకు ఇది ప్రాతిపదిక. 1998 నుంచి ఈ కూటమి

PM Modi Calls NDA A Natural Alliance: ఎన్డీయే సహజ కూటమి

మిత్రపక్షాల కలివిడి అద్భుతం

సుదీర్ఘకాలం కలిసి పనిచేద్దాం

ఎన్డీయే ఎంపీల భేటీలో మోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ‘‘ఎన్డీయే సహజ కూటమి. మిత్రపక్షాల సామూహిక గుర్తింపునకు ఇది ప్రాతిపదిక. 1998 నుంచి ఈ కూటమి అనేక విజయాలు దక్కించుకుంది. అయితే.. చేయాల్సిన పనులు, సాధించాల్సిన విజయాలు చాలానే ఉన్నాయి.’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దాదాపు ఏడాది తర్వాత ఎన్డీయే కూటమి పార్టీల ఎంపీలతో ప్రధాని మోదీ మంగళవారం సమావేశమయ్యారు. 2024, జూలై 2న తొలిసారి భేటీ అయిన ఆయన.. మళ్లీ మంగళవారమే ఎన్డీయే ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ‘అసాధారణ నాయకత్వం’తో విజయవంతం చేశారని ప్రశంసిస్తూ.. ఎన్డీయే మిత్రపక్షాల పార్లమెంటు సభ్యులు ప్రధానిని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా భారత భద్రతా దళాలు ఆపరేషన్‌ సిందూర్‌, ఆపరేషన్‌ మహాదేవ్‌లను అచంచల నిబద్ధతతో విజయవంతం చేశాయని పేర్కొంటూ ఓ తీర్మానాన్ని వెలువరించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. బీజేపీ సహా మిత్రపక్షాల సభ్యులు కలివిడిగా ఉన్నారని, ఈ కలివిడి మరింతగా పెరగాలని సూచించారు. ‘‘మనం సుదీర్ఘకాలం కలిసి నడవాల్సి ఉంది. సమన్వయం, సహకారంతో ముందుకు సాగుదాం’’ అని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి, దీనికి భారత సైన్యం దీటుగా స్పందించిన తీరుపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని కోరిన ప్రతిపక్షం.. తర్వాత చింతించే పరిస్థితి వచ్చిందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీపై విమర్శలు గుప్పించారు. ‘‘భారత భూభాగం, భద్రతపై అవగాహన, ఆధారాలు లేకుండా ఆయన(రాహుల్‌) పిల్ల చేష్టలకు పోయారు. అందుకే కోర్టు ఆయనకు మొట్టికాయలు వేసి తగిన గుణపాఠం చెప్పింది.’’ అని ఎద్దేవా చేశారు. పంద్రాగస్టును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే తిరంగా ర్యాలీలో ఎన్డీయే ఎంపీలు ఉత్సాహంగా పాల్గొనాలని మోదీ సూచించారు.

అమిత్‌షా అరుదైన రికార్డు!

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కాలం దేశ హోంమంత్రిగా పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. వాజపేయి హయాంలో బీజేపీ అగ్ర నేత ఆడ్వాణీ 2,256 రోజులు (ఆరేళ్ల 64 రోజులు) హోంమంత్రిగా పనిచేయగా.. మంగళవారంనాటికి 2,258 రోజుల(ఆరేళ్ల 66 రోజులు)తో షా ఆయన్ను అధిగమించారు. అమిత్‌ షా 2019 మే 20న కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పదవిలో కొనసాగుతున్నారు

Updated Date - Aug 06 , 2025 | 05:45 AM