PM Modi Putin: ప్రపంచశాంతికి భారత్-రష్యా స్నేహం కీలకం!
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:29 AM
అత్యంత క్లిష్ట సందర్భాల్లో కూడా భారత్-రష్యా భుజం భుజం కలిపి నడిచాయని, ఇరుదేశాల సంబంధాలు ప్రపంచశాంతికి, సుస్థిరతకు కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
పుతిన్ రాక కోసం భారతీయుల ఎదురుచూపులు
ఉక్రెయిన్‌లో శాంతి.. యావత్ మానవాళి కోరిక: మోదీ
బీజింగ్, సెప్టెంబరు 1: అత్యంత క్లిష్ట సందర్భాల్లో కూడా భారత్-రష్యా భుజం భుజం కలిపి నడిచాయని, ఇరుదేశాల సంబంధాలు ప్రపంచశాంతికి, సుస్థిరతకు కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. డిసెంబరులో రష్యా అధ్యక్షుడు పుతిన్ రాక కోసం 140 కోట్ల మంది భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని తెలిపారు. సోమవారం చైనాలోని టియాన్‌జిన్‌లో ‘షాంఘై సహకార సంఘం’ (ఎస్‌సీఓ) వార్షిక శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో పుతిన్‌తో మోదీ సమావేశమయ్యారు. ఆర్థిక, వాణిజ్య, ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే దిశగా ఇరు నేతలు చర్చలు జరిపారు. ఎరువుల అంశానికి కూడా చర్చల్లో ప్రాధాన్యం లభించింది. చర్చలపై మోదీ, పుతిన్‌ల స్పందనను వెల్లడిస్తూ ఇరుదేశాలు అధికారిక ప్రకటనలు వెలువరించాయి. మోదీ స్వయంగా ఎక్స్‌లో తన స్పందనను వెల్లడించారు. ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తుందని, ఘర్షణల నివారణ జరగాలని యావత్ మానవాళి కోరుకుంటున్నదని తెలిపారు. శాంతియుత పరిస్థితులు చిరకాలంపాటు నిలిచి ఉండేలా అన్ని భాగస్వామ్యపక్షాలు నిర్మాణాత్మక అడుగులు వేయాలని అభిలషించారు. కాగా, రష్యా-భారత్ దశాబ్దాలుగా పరస్పర విశ్వాసంతో కూడిన స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని, భవిష్యత్ సంబంధాలకు ఇదే పునాది అని పుతిన్ పేర్కొన్నారు. ఇరుదేశాల స్నేహం పార్టీల రాజకీయాలకు అతీతమైనదని, ఇరుదేశాల ప్రజలు కూడా దీనికి మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నారని తెలిపారు. పలు స్థాయిల్లో రష్యా-భారత్ సహకారం కొనసాగుతోందని, ఇరుదేశాల మధ్య పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. అంతర్జాతీయ వేదికలపై అత్యంత సమన్వయంతో వ్యవహరిస్తున్నామని పేర్కొంటూ ఐరాస, బ్రిక్స్, జీ20, ఎస్‌సీఓల గురించి పుతిన్ ప్రస్తావించారు.
మోదీ కోసం వేచి చూసిన పుతిన్
ద్వైపాక్షిక చర్చలకు వేదికైన భవనాన్ని చేరుకోవటానికి మోదీ, పుతిన్.. ఎస్‌సీఓ సదస్సు ప్రాంగణం నుంచి పుతిన్ కారులో ప్రయాణించారు. ఈ సందర్భంగా, మోదీ రాక కోసం పుతిన్ దాదాపు 10 నిమిషాలు వేచి ఉండటం విశేషం. అనంతరంకారులోనే నేతలిద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారని, వేదిక వద్దకు కారు చేరుకున్న తర్వాత కూడా.. దాదాపు 50 నిమిషాలు కారులో ఉండి సంభాషించుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌పై ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు.. ముఖ్యంగా, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు అదనంగా మరో 25 శాతం సుంకం మోపటంపై మోదీ, పుతిన్ కారులో మాట్లాడుకున్నట్లు సమాచారం.