Agriculture: అన్నదాతకు మద్దతు!
ABN , Publish Date - May 29 , 2025 | 05:24 AM
దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను(ఎంఎ్‌సపీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా మొత్తం 14 రకాల ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచింది.
వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు
ధాన్యానికి రూ.69, పెసలకు 86,
పత్తికి 589, ఆవాలకు 820 పెంపు
ఖరీఫ్ సీజన్ నుంచే అమలు
స్వల్పకాలిక రుణాలు కొనసాగింపు
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఖర్చుకు, మద్దతుకు పొంతనే లేదు: రైతు సంఘాలు
అమరావతి/న్యూఢిల్లీ, మే 28(ఆంధ్రజ్యోతి): దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను(ఎంఎ్‌సపీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా మొత్తం 14 రకాల ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచింది. వరికి 3 శాతం, పప్పుధాన్యాలు 5.96 శాతం, నూనె గింజలకు 9 శాతం చొప్పున ఎంఎ్‌సపీ పెరగనుంది. పెంచిన ధరలు 2025-26 ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఎంఎ్‌సపీ పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో ఖరీఫ్ పంటల సాగు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో మద్దతు ధరలపై దృష్టి పెట్టినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం.. కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపుతోపాటు స్వల్పకాలిక వడ్డీ రుణ పథకంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. సాధారణ, ఏ-గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాకు రూ.69 చొప్పున పెంచినట్టు తెలిపారు. ఇక, క్వింటా ఆవాలుకు రూ.820, రాగులకు రూ.596, నువ్వులకు రూ.579 పెంచినట్టు చెప్పారు. కౌలు, ఎరువులు, విత్తనాలు, పంట కోత, రవాణా, వృథా, ఇంధనం, కూలి ఖర్చులన్నీ లెక్క కట్టి, కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. సగటు ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసి, రైతులకు లాభదాయకంగా కనీస మద్దతు ధరలు నిర్ణయించామన్నారు.
రుణ సదుపాయం కొనసాగింపు
రైతులకు స్వల్పకాలిక సరసమైన వడ్డీ రుణ పథకాన్ని 2025-26లోనూ కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ)లు ఉన్న రైతులకు సవరించిన స్వల్పకాలిక రుణాలను అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న 1.5 శాతం వడ్డీ రుణాలను యథాతథంగా కొనసాగించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకాన్ని కొనసాగించడం వల్ల ఖజానాపై రూ.15,640 కోట్ల భారం పడుతుందని చెప్పారు. కేసీసీ ఉన్న రైతులు గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చని తెలిపారు. కాగా, దేశంలో 7.75 కోట్ల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
2 రైలు ప్రాజెక్టులకు అనుమతి
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలోని రెండు రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రత్లాం-నాగ్దా, వార్ధా-బల్లార్షాల మధ్య నాలుగో లైన్(176 కిలో మీటర్లు)ను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా మరింత వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులకు రూ.3,399 కోట్లను ఖర్చు చేయనున్నామని, 2029-30 నాటికి పూర్తవుతాయని చెప్పారు.
కనీస మద్దతు ధరలు(క్వింటాల్‌కు రూ.)
పంట 2024-25 2025-26 పెంపు
వరి కామన్ 2,300 2,369 69
వరి గ్రేడ్-ఏ 2,320 2,389 69
పత్తి మీడియం 7,121 7,710 589
పత్తి లాంగ్ స్టేబుల్ 7,521 8,110 589
జొన్న హైబ్రీడ్ 3,371 3,699 328
జొన్న మాల్దిండి 3,421 3,749 328
సజ్జ 2,625 2,775 150
రాగులు 4,290 4,886 596
మొక్కజొన్న 2,225 2,400 175
కందులు 7,550 8,000 450
మినుములు 7,400 7,800 400
పెసలు 8,682 8,768 86
ఆవాలు 8,717 9,537 820
వేరుశనగ 6,783 7,263 480
పొద్దుతిరుగుడు 7,280 7,721 441
సోయాబీన్ 4,892 5,328 436
నువ్వులు 9,267 9,846 579