Share News

Maha Kumbh Mela: కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:13 AM

మాఘ పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళాకు జనం భారీగా తరలివచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఘాట్‌లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకే దాదాపు 1.60 కోట్ల మంది పుణ్యాస్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Maha Kumbh Mela: కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

  • మాఘ పౌర్ణమిన మధ్యాహ్నానికే

  • 1.6 కోట్ల మంది స్నానాలు

  • హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం

  • భక్తుల భద్రత కోసం ఆపరేషన్‌ చతుర్భుజ్‌ ప్రారంభం

  • కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

ప్రయాగ్‌రాజ్‌, ఫిబ్రవరి 12: మాఘ పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళాకు జనం భారీగా తరలివచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఘాట్‌లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకే దాదాపు 1.60 కోట్ల మంది పుణ్యాస్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. త్రివేణీ సంగమం, ఇతర ఘాట్‌లలో 1.59 కోట్ల మంది స్నానాలు చేసినట్టు పేర్కొంది. కాగా, నెలరోజులుగా కొనసాగిన కల్పవాస్‌ కార్యక్రమం మాఘ పౌర్ణమి స్నానంతో ముగిసింది. సుమారు 10 లక్షల మంది కల్పవాసీలు మహాకుంభమేళా ప్రాంతం నుంచి తరలిపోవడం ప్రారంభమైంది. హెలికాప్టర్‌ నుంచి భక్తులపై పూల వర్షం కురిపించారు. మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే, భార్య చైత్న రాంతీర్థతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేశారు. మాఘ పౌర్ణమి రద్దీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ ప్రొటోకాల్స్‌ను రద్దు చేశారు.


భక్తుల భద్రత కోసం ‘ఆపరేషన్‌ చతుర్భుజ్‌’ చేపట్టామని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం(ఐసీసీసీ) నుంచి 2,750 హైటెక్‌ కెమేరాలు, యాంటీ డ్రోన్‌ వ్యవస్థ ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొంది. పొరుగు జిల్లాల నుంచి ఎన్ని వాహనాలు వస్తున్నాయో ఎప్పటికప్పుడు టోల్‌ ప్లాజాల నుంచి సమాచారం సేకరించి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రయాగ్‌రాజ్‌ ఏడీజీ భాను భాస్కర్‌ తెలిపారు. భక్తులకు ప్రతి 10 నిమిషాలకు అందుబాటులో ఉండేలా రవాణాశాఖ అదనంగా 1200 షటిల్‌ బస్సులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26న నిర్వహించే ‘అమృతస్నానం’తో మహాకుంభమేళా ముగియనుంది.

Updated Date - Feb 13 , 2025 | 05:13 AM