Manipur: బీజేపీ సీఎం రాజీనామా
ABN , Publish Date - Feb 09 , 2025 | 06:34 PM
BJP CM Resign: మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేాశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు ఆయన అందజేశారు. మణిపూర్‌లో అల్లర్లు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అదీకాక.. శనివారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం బీరెన్ సింగ్ సమావేశమయ్యారు. అనంతరం..అంటే ఆదివారం సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు.

మణిపూర్, ఫిబ్రవరి 09: మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్.. తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లాకు ఆయన అందజేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో శనివారం సీఎం బీరెన్ సింగ్ సమావేశమయ్యారు. అనంతరం బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా మణిపూర్‌లో అల్లర్లు జరుగుతోన్నాయి. దీంతో సీఎం బీరెన్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
2023, మే మాసంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌లో రెండు తెగలు.. మైతేయి, కూకీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 300 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది ప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఆ నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. అలాంటి వేళ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీరెన్ సింగ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి.
అనంతరం ఆ ప్రభుత్వానికి పలు పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకొన్నాయి. అయినా మణిపూర్‌లో బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్య బలం బాగానే ఉంది. దీంతో ఆ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను మార్చాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే న్యూఢిల్లీలోని అగ్రనాయకత్వానికి వరుస లేఖలు సంధించారు. అదీకాక.. మణిపూర్‌లో హింస చెలరేగడంతో... ఆ రాష్ట్రంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం పర్యటించారు.
స్థానికులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందంటూ ఈ నేపథ్యంలో మణిపూర్‌లో పర్యటించి.. ఆ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూచించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. బీరెన్ సింగ్‌పై సోమవారం అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్దమైంది. అలాంటి వేళ.. బీరెన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
For National News And Telugu News