Mandakrishna Madiga : ఉద్యమాలే జీవితం
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:30 AM
ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మశ్రీకి ఎంపికైన మందకృష్ణ మాదిగ జీవన ప్రస్థానం.. అనేక ఉద్యమాలతో ముడివేసుకొని ఉంది. మాదిxxxxxxxxగల కోసం ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ప్రారంభించిన ఆయన.. దివ్యాంగులు, వృద్ధులు, హృద్రోగంతో
మాదిగల కోసం 30 ఏళ్లుగా మందకృష్ణ పోరాటం
హైదరాబాద్ సిటీ, హనుమకొండ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మశ్రీకి ఎంపికైన మందకృష్ణ మాదిగ జీవన ప్రస్థానం.. అనేక ఉద్యమాలతో ముడివేసుకొని ఉంది. మాదిxxxxxxxxగల కోసం ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ప్రారంభించిన ఆయన.. దివ్యాంగులు, వృద్ధులు, హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారుల తదితరుల కోసం ఉద్యమాలు నిర్మించారు. మంద కృష్ణ మాదిగ స్వస్థలం వరంగల్ జిల్లా హన్మకొండ దగ్గర న్యూశాయంపేట. 1965లో ఆయన జన్మించారు. తండ్రి పేరు కొమురయ్య, తల్లి కొమురమ్మ. గ్రామంలో తలెత్తిన కులపరమైన ఘర్షణకు వ్యతిరేకంగా గొంతెత్తిన మంద కృష్ణ, ఆ ఘటనలో బాధితులపక్షాన నిలిచిన నాటి పీపుల్స్‌వార్ పార్టీ పట్ల ఆకర్షితుడయ్యారు. జనగామ జిల్లా ఆర్గనైజర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ క్రమంలో అరెస్టు అయ్యారు. అనంతరకాలంలో సాయుధ విప్లవ పంథాను వీడిన మంద కృష్ణ, అప్పటికే జనజీవన స్రవంతిలోకి వచ్చిన ప్రముఖ కవి శివసాగర్ వెంట నడిచారు. కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న దళిత మహాసభతో గొంతుకలిపారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాల విషయంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రకాశం జిల్లా ఈదుముడిలో 13 మంది యువకులతో 1994 జూలై7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించారు. ఉమ్మడి ఏపీవ్యాప్తంగా మాదిగ దండోరా ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. ఈ ఉద్యమం స్ఫూర్తితో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో సైతం ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలు బయలుదేరాయి. మంద కృష్ణ తన పేరు చివర మాదిగ సామాజికవర్గం పేరును కలుపుకొని మందకృష్ణ మాదిగగా ప్రకటించుకున్నారు. మాదిగల ఆత్మగౌరవానికి చిహ్నంగా మారారు. తెలంగాణ ఉద్యమంలోనూ మందకృష్ణ తనదైన పాత్ర పోషించారు.
2004లో హృద్రోగ చిన్నారుల శస్త్రచికిత్సకు సహాయసహకారాలను కూడగట్టే కార్యక్రమానికి నాంది పలికారు. గుండెజబ్బుల బారినపడిన చిన్నారులతో పెద్ద ర్యాలీ తీయడమేగాక ప్రత్యేక స్ర్కీనింగ్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో 5వేలమందికిపైగా చిన్నారులు గుండెజబ్బుతో బాధపడుతున్నారన్నది వెల్లడైంది. ఆ పోరాటం స్ఫూర్తిగానే నాటి సీఎం వైఎస్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారన్న అభిప్రాయాలున్నాయి. 2007లో మందకృష్ణ వికలాంగుల హక్కుల పోరాట సమితిని నెలకొల్పారు. దివ్యాంగులకు ప్రతినెలా పింఛన్లు ఇవ్వాలని, రిజర్వేషన్లను అమలు చేయాలని ఉద్యమించారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వికలాంగులకు పింఛన్ లభిస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తర్వాత వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎస్సీ వర్గీకరణ పోరును బలోపేతం చేశారు. గతేడాది ఎన్నికలప్పుడు ఎమ్మార్పీఎస్ సభకు ప్రధాని మోదీ హాజరై వర్గీకరణకు మద్దతు ప్రకటించారు. 30ఏళ్ల పోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిరుడు ఆగస్టులో వర్గీకరణకు అనూకులంగా తీర్పు వెలువరించింది. మంద కృష్ణ మాదిగ భార్య జ్యోతి. వారికి ముగ్గురు సంతానం.