Vasai Railway Tragedy: ఊహించని విషాదం.. టెంకాయ ప్రాణం తీసింది..
ABN , Publish Date - Sep 28 , 2025 | 08:05 PM
అతడు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో రైలులోంచి ఓ వ్యక్తి పూజల కోసం ఉపయోగించిన వస్తువులు ఉన్న మూటను బయటకు విసిరేశాడు. ఆ మూటలో టెంకాయ కూడా ఉంది. ఆ మూట నేరుగా వచ్చి సంజయ్ తలపై పడింది.
మర్యాద రామన్న సినిమా చూసిన వాళ్లకు ట్రైన్‌లో కొబ్బరి బోండం సీన్ గుర్తుండే ఉంటుంది. కిటికీ అవతల ఉన్న కొబ్బరి బోండంను లోపలకి లాగడానికి హీరో సునీల్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. తన వల్ల కాదని తెలిసి వదిలేస్తాడు. అయితే, కొబ్బరి బోండం ఇనుప స్తంభాన్ని కొట్టుకుని మళ్లీ ట్రైన్‌లోకి వస్తుంది. కమెడియన్ ఎస్ఎస్ కంచి తలకు తగిలి హీరో చేతుల్లోకి వచ్చి చేరుతుంది. అచ్చం ఇలాంటి సంఘటనే కాకపోయినా.. ట్రైన్‌లోంచి విసిరేసిన టెంకాయ బయట వెళుతున్న ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆదివారం చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. వాసాయ్, పంజు ఐలాండ్‌కు చెందిన సంజయ్ భోయిర్ అనే యువకుడు శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో నాయ్‌గావ్ రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. రోడ్డు పక్కనే రైల్వే బ్రిడ్జి ఉంది. అతడు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో రైలులోంచి ఓ వ్యక్తి పూజల కోసం ఉపయోగించిన వస్తువులు ఉన్న మూటను బయటకు విసిరేశాడు. ఆ మూటలో టెంకాయ కూడా ఉంది. ఆ మూట నేరుగా వచ్చి సంజయ్ తలపై పడింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఇది గమనించిన స్థానికులు అతడ్ని హుటాహుటిన డీఎమ్ పెటిట్ ఆస్పత్రికి తరలించారు. సంజయ్ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు అక్కడినుంచి ముంబైలోని ఓ పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అతడ్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే, తలకు బలమైన గాయం అయి రక్తం బాగా పోవటంతో చికిత్స పొందుతూ ఆదివారం అతడు చనిపోయాడు. సంజయ్ మరణంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. రైలు నుంచి వస్తువులు బయటపడేసే వారిపై రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో గంటలో భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక..
ముళ్లపందితో పెట్టుకున్న మొసళ్లు.. చివరికి వాటి పరిస్థితి ఏమైందో చూస్తే..