Share News

3 Wives: ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. మూడు ఫ్యామిలీలను పోషించలేక..

ABN , Publish Date - May 29 , 2025 | 04:58 PM

3 Wives: బెంగళూరుకు చెందిన బాబాజాన్ ముగ్గురు భార్యలకు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. వీరందరినీ పోషించటం అతడికి తలకు మించిన భారం అయింది. ఈ నేపథ్యంలోనే దొంగగా మారిపోయాడు.

3 Wives: ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. మూడు ఫ్యామిలీలను పోషించలేక..
Man Becomes Thief

’ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్‘ సినిమాలో కానిస్టేబుల్ క్రిష్టయ్యకు ఇద్దరు పెళ్లాలు ఉంటారు. వారి కారణంగా అతడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ప్రతీ రోజూ ఏదో ఒక విషయంలో గొడవలు అవుతూ ఉంటాయి. మరో వైపు ఉద్యోగం లోనూ అతడికి మనస్సాంతి లేకుండా పోతుంది. ఓ వైపు భార్యలు.. మరో వైపు ఉద్యోగం టార్చర్ భరించలేక అతడు దొంగగా మారిపోతాడు. ఇంచుమించు ఇలాంటి సంఘటనే నిజ జీవితంలో ఒకటి జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ ముగ్గురు భార్యలు, వారి తొమ్మిది మంది పిల్లల్ని పోషించలేక దొంగగా మారిపోయాడు.


ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన బాబాజాన్ అనే 36 ఏళ్ల వ్యక్తికి ముగ్గురు భార్యలు ఉన్నారు. వారిలో ఒకరు బెంగళూరు షికారిపాళ్యలో ఉంటుండగా.. మిగిలిన ఇద్దరు చిక్కబళ్లాపుర, శ్రీరంగపట్నలో ఉంటున్నారు. ఈ ముగ్గురు భార్యలకు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. వీరందరినీ పోషించటం బాబాజాన్‌కు తలకు మించిన భారం అయింది. ఈ నేపథ్యంలోనే దొంగగా మారిపోయాడు. గత కొన్ని నెలల నుంచి బెంగళూరులో దొంగతనాలు చేస్తూ ఉన్నాడు.


ఇప్పటి వరకు మొత్తం 8 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. ఎలక్ట్రానిక్ సిటీలో అతడిపై కేసు నమోదైంది. బుధవారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి 188 గ్రాముల బంగారు ఆభరణాలు, 550 గ్రాముల వెండి ఆభరణాలు, 1500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘ బాబాజాన్ అరెస్ట్‌తో మొత్తం 8 కేసులు పరిష్కరించాం. మూడు ఫ్యామిలీలను పోషించలేక అతడు దొంగగా మారానని చెప్పాడు. ముగ్గురు భార్యలు, 9 మంది పిల్లలతో ఎంతో ప్రేమగా ఉంటున్నాడు’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

యూనీఫామ్ లేని యుద్ధ వీరుడు.. ఆపరేషన్ సిందూర్‌లో జవాన్లకు సాయం..

పుట్‌పాత్‌పై యువకుడ్ని చావగొట్టిన ముగ్గురు యువతులు..

Updated Date - May 29 , 2025 | 06:19 PM