Mahesh Jirawala: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాతీ ఫిల్మ్ మేకర్ మృతి.. ధ్రువీకరించిన అధికారులు
ABN , Publish Date - Jun 21 , 2025 | 02:16 PM
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఫిల్మ్ మేకర్ మహేశ్ జీరవాలా కూడా మృతిచెందినట్టు అధికారులు ధ్రువీకరించారు.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఫిల్మ్ మేకర్ మహేశ్ జీరవాలా మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. డీఎన్ఏ టెస్టులతో ఈ విషయాన్ని నిర్ధారించారు.
ఘటన జరిగిన రోజు మహేశ్ స్కూటీపై వెళుతున్న ప్రాంతంలోనే విమానం కూలిపోయింది. అక్కడికి 700 మీటర్ల దూరంలో మహేశ్ ఉన్నట్టు అతడి సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా తెలిసిందని మృతుడి భార్య పేర్కొన్నారు. దీంతో, ఈ విషయంపై సస్పెన్స్ కొనసాగింది. విమానం కూలిన పరిసరాల్లోనే మంటల్లో కాలిన స్థితిలో అతడి స్కూటీ కూడా లభించింది. దీంతో, ఈ ప్రమాదంలో అతడు మరణించి ఉంటారన్న అనుమానాలు బలపడ్డాయి. స్వీచాఫ్‌లో ఉన్న అతడి మొబైల్ కూడా అక్కడే లభించింది.
ఈ దుర్ఘటనలో మరణించిన వారి దేహాలు కాలిపోవడంతో వారి గుర్తింపు కష్టంగా మారింది. మహేశ్ మరణించాడన్న వాస్తవాన్ని అతడి కుటుంబసభ్యులు నమ్మలేకపోయారు. మృతదేహాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు. అయితే, మహేశ్ భార్య అప్పటికే తన డీఎన్ఏ శాంపిళ్లను కూడా ఇచ్చింది. టెస్టుల అనంతరం అతడి మృతదేహాన్ని గుర్తించగలిగారు. అతడి మరణాన్ని ధ్రువీకరించారు. నరోదాకు చెందిన మహేశ్ పలు మ్యూజిక్ వీడియోలను డైరెక్ట్ చేశారు. తన సొంత ప్రొడక్షన్ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు.
అధికారిక లెక్కల ప్రకారం, విమాన ప్రమాదానికి సంబంధించి 231 డీఎన్ఏ శాంపిల్స్‌తో మృతదేహాల గుర్తింపు పూర్తయ్యింది. 210 మృత దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో 155 మంది భారతీయులు, 36 బ్రిటన్ జాతీయులు, ఏడుగురు పోర్చుగల్ వాసులు, ఒక కెనడా వ్యక్తితో పాటు స్థానికంగా మరో తొమ్మిది మంది దుర్మరణం చెందారు.
విమానంలోని బ్లాక్ బాక్సులు కూడా దెబ్బతినడంతో వాటి నుంచి డేటా సేకరించడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో వీటిని అమెరికాకు పంపించే యోచనలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని సమాచారం.
ఇవి కూడా చదవండి:
వరుసగా 51 పుష్ అప్స్.. జనాలను సర్‌ప్రైజ్ చేసిన తమిళనాడు గవర్నర్
ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిర్మాణాలపై కేంద్రం నజర్.. నిబంధనలు కఠినతరం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి