Share News

Maharashtra Minister Phone Scandal: అసెంబ్లీలో ఫోన్లో పేకాట ఆడిన మంత్రి

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:20 AM

ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే.. ఆ రాష్ట్ర మంత్రి మాత్రం తీరిగ్గా కూర్చొని ఫోన్‌లో గేమ్‌ ఆడుతూ కన్పించారు. బీజేపీ నేతృత్వంలోని

Maharashtra Minister Phone Scandal: అసెంబ్లీలో ఫోన్లో పేకాట ఆడిన మంత్రి
Maharashtra Minister Phone Scandal

  • రైతు సమస్యలపై చర్చ జరుగుతుండగా మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి కొకాటే నిర్వాకం

  • వీడియో తీసి, ఎక్స్‌లో పెట్టిన ఎన్సీపీ ఎమ్మెల్యే

  • ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని విపక్షాల డిమాండ్‌

పూణె, జూలై 20: ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే.. ఆ రాష్ట్ర మంత్రి మాత్రం తీరిగ్గా కూర్చొని ఫోన్‌లో గేమ్‌ ఆడుతూ కన్పించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది. ఎన్సీపీ(అజిత్‌ పవార్‌)కి చెందిన వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్‌ కొకాటె.. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో తన ఫోన్‌లో ఆన్‌లైన్‌ పేకాట ఆడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రతిపక్ష ఎన్సీపీ(శరద్‌ పవార్‌)నేత రోహిత్‌ పవార్‌.. తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ’’రాష్ట్రంలో రోజుకు సగటున ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎన్నో వ్యవసాయ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. బీజేపీని సంప్రదించకుండా ఏమీ చేయలేనందున, మంత్రికి వేరే పని లేకపోవడంతో పేకాడటానికి సమయం దొరికినట్లు కనిపిస్తోంది’’ అని విమర్శించారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశాయి. ఈ మంత్రి గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రవర్తన ప్రజాస్వామ్యానికే అవమానకరమని శివసేన(యూబీటీ) వర్గం విమర్శించింది.

Updated Date - Jul 21 , 2025 | 04:21 AM