డ్యూటీ టైం ముగిసింది.. విమానం నడపను
ABN , Publish Date - Jun 08 , 2025 | 06:11 AM
తాను విమానం నడపబోనంటూ పైలట్ నిరాకరించడంతో ఆయన విమానాశ్రయంలో గంట సేపు ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు విమాన కంపెనీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో ఆ పైలట్ తన పట్టువీడాడు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండేకు వింత అనుభవం
ముంబై, జూన్ 7: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు వింత అనుభవం ఎదురయింది. డ్యూటీ సమయం ముగిసిపోయింది, తాను విమానం నడపబోనంటూ పైలట్ నిరాకరించడంతో ఆయన విమానాశ్రయంలో గంట సేపు ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు విమాన కంపెనీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో ఆ పైలట్ తన పట్టువీడాడు. ముక్తాయినగర్‌లోని సంత్ ముక్తాయి పల్లకీ సేవలో పాల్గొనేందుకు శుక్రవారం షిండే వ్యక్తిగత విమానంలో ముంబయి నుంచి జలగావ్ బయలుదేరారు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బయలుదేరడమే రెండున్నర గంటలు ఆలస్యమయింది. నిర్ణీత సమయం కన్నా మూడున్నర గంటలు ఆలస్యంగా జలగావ్ చేరుకున్నారు. అక్కడి నుంచి ముక్తాయినగర్‌కు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు గిరీష్ మహాజన్, గులాబ్‌రావ్ పాటిల్, ఇతర అధికారులు ఉన్నారు. అక్కడ పూజల్లో పాల్గొని రాత్రి 9.15 సమయంలో తిరిగి జలగావ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే వారికి అనూహ్య సంఘటన ఎదురయింది. తన డ్యూటీ సమయం ముగిసిందని, విమానం నడపబోనంటూ వారికి పైలట్ తేల్చి చెప్పాడు. దాంతో షిండే వెంట ఉన్న ఇద్దరు మంత్రులు, అధికారులు 45 నిమిషాలపాటు నచ్చజెప్పడంతో మెత్తపడి చివరకు విమానం నడపడానికి అంగీకరించాడు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..