Share News

Mahakumbh Mela: 30 కాదు.. 79 మంది..!

ABN , Publish Date - Feb 09 , 2025 | 05:26 AM

తొక్కిసలాటలో 30 మంది మృతిచెందారని యూపీ ప్రభుత్వం గత వారం ప్రకటించగా.. ఆ తర్వాత మృతుల సంఖ్యపై మళ్లీ ప్రకటన చేయలేదు. అయితే ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజ్‌,

Mahakumbh Mela: 30 కాదు.. 79 మంది..!

మహాకుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య ఇది..

స్పష్టం చేస్తున్న ఆస్పత్రుల రికార్డులు

‘న్యూస్‌లాండ్రీ’ పరిశీలనలో వ్లెలడి

‘30’ తర్వాత మృతుల సంఖ్యపై మళ్లీ ప్రకటన చేయని యూపీ ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యపై సంచలన విషయం బయటకు వచ్చింది. ఆ రోజున చనిపోయింది 30 మంది కాదని, 79 మంది అని అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. తొక్కిసలాటలో 30 మంది మృతిచెందారని యూపీ ప్రభుత్వం గత వారం ప్రకటించగా.. ఆ తర్వాత మృతుల సంఖ్యపై మళ్లీ ప్రకటన చేయలేదు. అయితే ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజ్‌, స్వరూపరాణి హాస్పిటల్‌ సహా నాలుగు ఆస్పత్రుల్లో పరిశీలన చేసిన ‘న్యూస్‌లాండ్రీ’ అనే మీడియా సంస్థ.. జనవరి 29న జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్యను 79గా తేల్చింది. మృతదేహాలను ఒకే ప్రదేశం నుంచి బాధిత కుటుంబాలకు అందజేశామని యూపీ ప్రభుత్వం చెబుతున్న మోతీలాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజ్‌కు న్యూస్‌లాండ్రీ బృందం వెళ్లింది. అక్కడ 69 మందితో కూడిన జాబితాను ఓ అధికారి చూపించారు. వీరంతా మహాకుంభ్‌ తొక్కిసలాటలో మరణించిన వారేనని, ఆ తర్వాత ఇక్కడకు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఫిబ్రవరి 3న 66 మంది మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందించగా.. మరో ముగ్గురి గుర్తింపు తెలియలేదని తెలిపారని పేర్కొంది. యూపీ, బిహార్‌, బెంగాల్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు చెందిన ఈ 69 మందిలో 10 మంది పురుషులు కాగా.. మిగతా వారంతా మహిళలే. ఒక మృతదేహానికి కూడా పోస్టుమార్టం చేయలేదని తెలిసింది.


వీలైనంత త్వరగా మృతదేహాలను వారికి ఇళ్లకు పంపాలని అధికారులు హడావుడి చేశారని ఓ అధికారి చెప్పారు. అదేవిధంగా స్వరూపరాణి హాస్పిటల్‌కు కూడా న్యూస్‌లాండ్రీ బృందం వెళ్లింది. ఏడుగురు చనిపోయారని, 36 మంది గాయపడ్డారని పేర్కొంటూ అక్కడ ట్రామా సెంటర్‌లోని బులెటిన్‌ బోర్డులో జాబితాలను అతికించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్య సేవల సూపరింటెండెంట్‌ ఇన్‌చార్జి అజయ్‌ సక్సేనా కూడా ధ్రువీకరించారు. 4వ తేదీన అక్కడకు వెళ్లగా.. ఆస్పత్రి గేటు వద్ద స్థానిక పోలీసులు కుంభ్‌ నుంచి స్వరూపరాణి ఆస్పత్రికి వచ్చిన మృతుల వివరాలను సేకరిస్తున్నారు. వీరి దగ్గరి ఆరుగురి మృతికి సంబంధించిన సమాచారం ఉంది. వీరిలో ఇద్దరి పేర్లు ఆస్పత్రి బోర్డులో ఉండడంతో.. మొత్తం 11మంది మృతులను తేల్చారు. ఆస్పత్రి బోర్డులో పేర్కొన్న ఒకరు తొక్కిసలాట ఘటనకు ముందే చనిపోవడంతో.. మరో 10 మృతదేహాల లెక్క తేలింది. దీంతో కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన వారి సంఖ్య 79గా వెల్లడైందని న్యూస్‌లాండ్రీ పేర్కొంది. దీనిపై వివరణ కోరేందుకు ప్రయాగ్‌రాజ్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అరుణ్‌కుమార్‌ తివారీని సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదని తెలిపింది. మరోవైపు చనిపోయిన వారి మరణ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు కూడా బాధిత కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నట్లు పరిశీలనలో వెల్లడైందని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 05:26 AM