Share News

Maha Kumbh Mela: 4 రోజుల్లో 6 కోట్ల మంది!

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:57 AM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ మహోత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో కోట్లాదిమంది పాలుపంచుకుంటూ.. భక్తిపారవశ్యంతో మునిగి తేలుతున్నారు.

Maha Kumbh Mela: 4 రోజుల్లో 6 కోట్ల మంది!

  • వైభవంగా సాగుతున్న మహా కుంభమేళా

మహాకుంభ్‌ నగర్‌/లఖ్‌నవూ, జనవరి 16: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ మహోత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో కోట్లాదిమంది పాలుపంచుకుంటూ.. భక్తిపారవశ్యంతో మునిగి తేలుతున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో గురువారం లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరించగా, తొలి 4 రోజుల్లో అమృత స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 6 కోట్లు దాటిందని అధికారికవర్గాలు పేర్కొన్నాయి. 45రోజులుసాగే మహా కుంభమేళాలో పాల్గొనేందుకు 50 కోట్ల మంది వరకు ప్రయాగ్‌రాజ్‌ వచ్చే అవకాశం ఉందని డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ అన్నారు. 20 లక్షల మంది వరకు విదేశీ యాత్రికులు ఉంటారని అంచనా వేశారు. కాగా, భారత విదేశాంగ శాఖ ఆహ్వానం మేరకు 10 దేశాలకు చెందిన 21 మందితో కూడిన అంతర్జాతీయ బృందం ప్రయాగ్‌రాజ్‌లోని తాత్కాలిక టెంట్‌ సిటీకి చేరుకుంది.


వీరంతా త్రివేణి సంగంలో పవిత్ర స్నానాలు చేయడంతోపాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కుంభ్‌ ఆధ్మాత్మిక వైభవంలో కాంటే వాలే బాబా అలియాస్‌ రమేశ్‌ కుమార్‌ మాంఝీ ‘ముళ్ల కంప పాన్పు’పై పడుకొని డమరుకం మోగిస్తూ తన భక్తిని చాటారు. మహా కుంభమేళాను ప్లాస్టిక్‌ రహితంగా ఉంచేందుకు ఆరెస్సెస్‌ ‘వన్‌ ప్లేట్‌, వన్‌ బ్యాగ్‌’ ప్రచారాన్ని ప్రారంభించింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ యోగా సాధకులు 129 ఏళ్ల స్వామి శివానంద బాబా మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఈయన గత వందేళ్లుగా ప్రయాగ్‌రాజ్‌, నాసిక్‌, ఉజ్జయినీ, హరిద్వార్‌లతో జరిగే ప్రతి కుంభమేళా కు హాజరవుతున్నారని ఆయన శిష్యుడు సంజయ్‌ సర్వజన పేర్కొన్నారు.


మహా కుంభమేళాలో శ్రీవారికి స్నపన తిరుమంజనం

తిరుమల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్‌వద్ద గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం గంగా నది ఒడ్డున ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించింది.

Updated Date - Jan 17 , 2025 | 04:57 AM