Share News

Maha Kumbh Mela 2025: మహాకుంభమేళలో కన్నీటి ఎదురుచూపులు... తప్పిపోయిన ఆ 1,500 మంది జాడ ఎక్కడ..

ABN , Publish Date - Jan 31 , 2025 | 09:30 AM

మ‌హా కుంభ‌మేళాలో మౌని అమావాస్య సంద‌ర్భంగా తొక్కిస‌లాట‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కోట్లాది మంది భ‌క్తులు ఒకేసారి త‌ర‌లిరావ‌డంతో సంగం ఘాట్ వ‌ద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే..

Maha Kumbh Mela 2025: మహాకుంభమేళలో కన్నీటి ఎదురుచూపులు... తప్పిపోయిన ఆ 1,500 మంది జాడ ఎక్కడ..
Maha Kumbh Mela

Maha Kumbh Mela 2025: మ‌హా కుంభ‌మేళాలో జరుగుతున్న వరుస ప్రమాదాలు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్లిన వాళ్లు తిరిగి క్షేమంగా వస్తారో లేదోనన్న టెన్షన్‌తో ఉంటున్నారు. ఇంటి దగ్గర ఉన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సైతం జరుగుతున్న వరుస ప్రమాదాలతో దిగులుచెందుతున్నారు.

మ‌హా కుంభ‌మేళాలో వరుస ప్రమాదాలు

దాదాపు పదిరోజుల క్రితం రెండు గ్యాస్ సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగిన ఘటనలో 18 టెంట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారనే సంగతి ఇప్పటి వరకు బయటపడలేదు. ఇటీవల మౌని అమావాస్య సంద‌ర్భంగా తొక్కిస‌లాట‌లో దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది భ‌క్తులు ఒకేసారి త‌ర‌లిరావ‌డంతో సంగం ఘాట్ వ‌ద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందమందికి పైగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మరువకముందే ప్రయాగ్‌రాజ్ సెక్టార్ 22లోని ఛట్‌నాగ్ ఘాట్ వద్ద ప్రమాదవశాత్తు మరో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కూడా సుమారు 15 గుడారాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి మంటలను అదుపులోకి తెచ్చింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.


కన్నీటి ఎదురుచూపులు

ఇదిలా ఉంటే.. డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, సుమారు 1,500 మంది తప్పిపోయినట్లు తెలుస్తోంది. కాసేపట్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన వారి జాడ కనుచూపుమేరలో లేకపోవడంతో.. బాధిత కుటుంబాలు విలవిలలాడుతున్నాయి.. 'అమ్మా..! నా కొడుకు ఎక్కడా?' అంటూ మహాకుంభమేళలో కన్నీటి ఎదురుచూపులు కనిపిస్తున్నాయి..

భద్రతా వైఫల్యమే కారణమా..

తప్పిపోయిన వారి ఆచూకీ కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్థానిక అధికారులతో పాటు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. ఈ సంఘటన ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే, అసలు ఇలా వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? భద్రతా వైఫల్యమే ఇందుకు కారణమా? జరుగుతున్న ప్రమాదాలపై బాధ్యులకు ప్రభుత్వం ఎలా అండగా ఉండనుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 31 , 2025 | 09:44 AM