Madras High Court : ఆన్‌లైన్ గేమ్స్ నియంత్రణ చట్టం సబబే
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:54 AM
తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్ గేమ్స్‌ను క్రమబద్ధీకరించడానికి తీసుకొన్న చట్టాన్ని మద్రాసు హైకోర్టు చెల్లుబాటు చేయడం ఆమోదించింది. గోప్యత హక్కు ఉన్నా, సమాజానికి హాని కలగకుండా వ్యక్తిగత గోప్యతలో కొన్ని పరిమితులు అవసరమని కోర్టు పేర్కొంది.
మద్రాసు హైకోర్టు తీర్పు
చెన్నై, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ గేమ్స్‌ను క్రమబద్ధీకరించడానికి తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటవుతుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. 2022లో ఆన్‌లైన్ జూదాలు, క్రీడలను క్రమబద్ధీకరించడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందించింది. ఆ చట్టంలోని అంశాలను గత ఫిబ్రవరి 14న ప్రభుత్వ గెజిట్‌లో వెలువరించింది. ఆ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఆన్‌లైన్ క్రీడలు ఆడేందుకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేయాలని పేర్కొంటూ.. అర్ధరాత్రి 12 నుంచి వేకువజాము 5 గంటల వరకు ఆన్‌లైన్ క్రీడలు ఆడటంపై నిషేధం విధించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆన్‌లైన్ గేమ్స్ సంస్థల తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. మంగళవారం తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటు అవుతుందని తేల్చిచెప్పింది. గోప్యత ప్రాథమిక హక్కే అయినా ఆ హక్కు సంపూర్ణం కాదని, సమాజానికి హాని కలుగుతుంది కనుక వ్యక్తిగతపరమైన గోప్యతలో జోక్యం తప్పనిసరి అవుతుందని స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news