List of Corrupt Nations: అవినీతిమయ దేశాల జాబితా విడుదల! భారత్ పరిస్థితి ఏంటంటే..
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:28 PM
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తాజాగా అవినీతి మయ దేశాల జాబితా విడుదల చేసింది. ఇందులో సౌత్ సుడాన్ అత్యంత అవినీతి మయ దేశంగా నిలవగా భారత్ 96వ స్థానంలో ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ దేశాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెబుతూ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ) సంస్థ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. అవినీతి అత్యల్పంగా ఉన్న డెన్మార్క్ ఈ జాబితాలో తొలి స్థానం సొంతం చేసుకోగా భారత్ 96వ స్థానంలో నిలిచింది. వివిధ దేశాల్లోని నిపుణులు, వ్యాపారుల అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ముదింపు వేసింది. మొత్తం 180 దేశాలతో ఈ లిస్టు సిద్ధం చేసింది. అత్యంత అవినీతిమయ దేశాలకు సున్నా స్కోరు, అవినీతి ఇసుమంతైనా లేని దేశాలకు 100 స్కోరు కేటాయించింది (Corruption Index).
Supreme Court: ఎన్నికల్లో ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ లిస్టు ప్రకారం, గత నివేదికలతో పోలిస్తే భారత్ స్కోరు స్వల్పంగా తగ్గింది. 2023 నివేదికలో భారత్ 38 పాయింట్లు, 2022 నాటి రిపోర్టులో 40 పాయింట్స్ సాధించింది. తాజాగా 2024 రిపోర్టులో భారత్ స్కోరు 38గా నిర్ధారించారు. ఇక భారత్ పొరుగు దేశాలై పాకిస్థాన్ 135వ స్థానం, శ్రీలంక 121 స్థానంలో ఉన్నాయి. బంగ్లాదేశ్ 149 స్థానంలో ఉండగా చైనా 76వ ర్యాంకు సొంతం చేసుకుంది.
Kejriwal: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?
గతశతాబ్దంలో ఎన్నడూ లేని విధంగా అనేక దేశాల్లో అవినీతి పెరిగిందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది. అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్‌తో పాటు నిరంకుశత్వ పాలన సాగుతున్న రష్యా, వెనిజువెలాలో కూడా ప్రభుత్వాల అవినీతి పెరిగిందని టీఐ పేర్కొంది. అమెరికా స్కోరు 69 నుంచి 65 పాయింట్లకు తగ్గి 24 స్థానం నుంచి 28 స్థానానికి పడిపోయింది. ఫ్రాన్స్ కూడా నాలుగు పాయింట్లు కోల్పోయి 25 స్థానానికి పరిమితమైంది. ఇక జర్మనీ మూడు పాయింట్ల కోల్పోయి 75 స్కోరుతో 15వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.
ఇక ఈ జాబితాలో సౌత్ సుడాన్ కేవలం 8 పాయింట్ల స్కోరుతో అత్యంత అవినీతిమయ దేశంగా సోమాలియాను వెనక్కు నెట్టి తొలిస్థానంలోకి వచ్చింది. ఇక సోమాలియా 9 పాయింట్లు, వెనెజువెలా 10 పాయింట్లు, సిరియా 12 పాయింట్లతో ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలో అవినీతి ఆందోళనకర స్థాయిలోనే ఉందని టీఐ అభిప్రాయపడింది. ఈ జాబితాలోని 32 దేశాలే అవినీతిని కొంతమేర అరికట్టగలిగాయని, మిగతా 148 దేశాల్లోని పరిస్థితి యథాతథంగా ఉండటం లేదా మరింత దిగజారడం చూశామని టీఐ పేర్కొంది.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.