Bengaluru: బెంగళూరు సెంట్రల్ జైల్లో లష్కరే తొయిబా ఉగ్ర నెట్‌వర్క్
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:30 AM
ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తొయిబా కర్ణాటకలోని కారాగారాలను కేంద్రంగా చేసుకుని తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టు ఎన్‌ఐఏ కనుగొంది.
జైల్లోనే ఉగ్రవాద భావజాలం వ్యాప్తి.. కొత్త దాడులకు ప్లాన్
ఉగ్రవాది నజీర్ నేతృత్వంలో బెంగళూరులో పేలుళ్లకు కుట్ర
బెంగళూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తొయిబా కర్ణాటకలోని కారాగారాలను కేంద్రంగా చేసుకుని తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టు ఎన్‌ఐఏ కనుగొంది. బెంగళూరు సెంట్రల్ జైలులో ఏకంగా నెట్‌వర్క్‌నే నిర్వహిస్తూ, కొత్త దాడులకు ఈ సంస్థ వ్యూహరచన చేస్తుండటం దర్యాప్తు అధికారులనే నివ్వెరపరిచింది. ఈ జైలులో తాజాగా జరిపిన తనిఖీల్లో భారీ కుట్ర బయటపడింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని జైళ్లను ఎన్‌ఐఏ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా బిహారీలను ఉంచిన జైళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని హెచ్చరించింది. సిబ్బందిలోకి ఉగ్రవాద భావజాలాన్ని చొప్పిస్తున్నారని తెలిపింది. ఎన్‌ఐఏ ఉన్నతాధికార వర్గాల సమాచారం ప్రకారం, యావజ్జీవ కారాగార శిక్ష పడిన నజీర్ అనే ఉగ్రవాదిని బెంగళూరు సెంట్రల్ జైలులో ఉంచారు. అతడు అక్కడ మొబైల్ ఫోన్‌ను సమకూర్చుకొని బయట ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. నిధుల సేకరణ మొదలు, క్యాడర్‌కు ఆదేశాలు జారీచేయడం, కొత్త దాడులకు వ్యూహరచన దాకా.. ప్రతిదీ ఫోన్‌పై నడిపిస్తూ సొంత నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకున్నాడు. ఇందులో జైలు సిబ్బంది నజీర్‌కు సహకరించినట్టు ఎన్‌ఐఏ విచారణలో తెలిసింది. నజీర్ బెంగళూరులో భారీ విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్టు వెల్లడైంది.
రూ.10వేల ఫోన్.. రూ.50వేలకు
జైలు మానసిక వైద్యుడు నాగరాజ్ నజీర్‌కు ఫోన్ సమకూర్చినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. రూ.10వేల ఫోన్‌ను రూ.50వేలకు అమ్మినట్లు వెల్లడైంది. నజీర్‌కే కాకుండా జైల్లో ఉన్న చాలా మంది ఖైదీలకు నాగరాజు ఫోన్లను సమకూర్చాడు. జైలు ఏఎ్‌సఐ చాంద్ పాషా.. ఉగ్రవాది నజీర్‌కు 2022 నుంచి సహకరిస్తున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. నజీర్‌ను కోర్టుకు ఎప్పుడు తీసుకువెళ్తారు అనే విషయాలపై ఎప్పటికప్పుడు ఆయన ఆప్తులకు సమాచారం ఇచ్చేవాడని అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడు జునాయిద్ అహ్మద్ అనే ఉగ్రవాది తల్లి అనీస్ ఫాతిమా.. తన కుమారుడికి, నజీర్‌కు మధ్యవర్తిగా వ్యవహరించింది. నజీర్ ఇచ్చిన సూచనలను అహ్మద్‌కు ఆమె చేరవేసింది. అహ్మద్ గల్ఫ్‌లో ఉంటూ దక్షిణాదిలో ఉగ్రవాద దుశ్చర్యలకు నాయకత్వం వహిస్తున్నాడని భావిస్తున్నారు. ఈ ముగ్గురినీ బెంగళూరు, కోలారుల్లో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.