Share News

Khalid Abu Safiullah: సింధ్‌లో లష్కర్‌ ఉగ్రవాది ఖాలిద్‌ హతం

ABN , Publish Date - May 19 , 2025 | 04:45 AM

భారతంపై అనేక ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన లష్కర్‌ ఉగ్రవాది ఖాలిద్‌ పాకిస్థాన్‌లో హతమయ్యాడు. సింధ్‌ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో అతడు మృతి చెందాడు.

 Khalid Abu Safiullah: సింధ్‌లో లష్కర్‌ ఉగ్రవాది ఖాలిద్‌ హతం

కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తి

న్యూఢిల్లీ, మే 18: లష్కర్‌ ఎ తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది రజావుల్లా నిజామానీ ఖాలిద్‌ అలియాస్‌ అబూ సఫీవుల్లా ఖాలిద్‌ ఆదివారం పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపినట్టు అధికారవర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మాల్టీలోని తన ఇంటి నుంచి బయలుదేరి వెళ్తుండగా బాద్నీ క్రాసింగ్‌ వద్ద కాల్పులు జరిగాయని పేర్కొన్నాయి. 2006లో నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడికి ఇతడే కీలక సూత్రధారి. ముగ్గురు తీవ్రవాదులు వచ్చి కాల్పులు జరపగా ఎదురుకాల్పుల్లో వారంతా మరణించా రు. దాదాపు 25ఏళ్లుగా భారత్‌పై ఏదో రూపంలో దాడులు చేస్తూనే ఉన్నాడు. తొలుత 2000లో నేపాల్‌లో లష్కర్‌ ఎ తోయిబాను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించాడు. ఉగ్రవాదుల భర్తీని కూడా అప్పుడే చేపట్టాడు. వినోద్‌ కుమార్‌, రజావుల్లా, మహమ్మద్‌ సలీం వంటి మారు పేర్లతో భారత్‌లో పలుమార్లు దాడులు చేశాడు. 2005లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌పై జరిగిన దాడికీ కీలక సూత్రధారి ఇతడే. ఆ దాడిలో ప్రొఫెసర్‌ మునీష్‌ చంద్ర పురీ ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు. దాడులు చేసిన ఉగ్రవాదులు తప్పించుకున్నారు. దర్యాప్తు జరిపిన పోలీసులు లష్కర్‌ అగ్రనాయకుడు అబు అనీ్‌సపై కేసు పెట్టారు. అతడు ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ప్రస్తుతం హతమైన ఖాలిద్‌..అబు అనీ్‌సకు అత్యంత సన్నిహితుడు. 2008లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ స్థావరంపై జరిగిన దాడిలోనూ కీలక పాత్ర పోషించాడు. ఆ దాడిలో ఏడుగురు జవాన్లు, మరో సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. దాడి చేసిన ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నారు.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:45 AM