Kerala High Court: శబరిమలలో భక్తుల భద్రతకు సాంకేతిక కమిటీ
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:21 AM
శబరిమలకు వచ్చే భక్తుల భద్రత ముఖ్యమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. రెండు వేర్వేరు తీర్పుల్లో.. విద్యుదాఘాతం వంటి ఘటనలు జరగకుండా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విభాగాలు, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)లను ఆదేశించింది.
కేఎస్‌ఈబీ, టీడీబీ కలిసి ఏర్పాటు చేయాలన్న కేరళ హైకోర్టు
కోచి, ఆగస్టు 23: శబరిమలకు వచ్చే భక్తుల భద్రత ముఖ్యమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. రెండు వేర్వేరు తీర్పుల్లో.. విద్యుదాఘాతం వంటి ఘటనలు జరగకుండా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విభాగాలు, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)లను ఆదేశించింది. గత నెల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఓ భక్తురాలు శబరిమల దర్శనానికి వచ్చి, తాగునీటి కియోస్క్ వద్ద నీళ్లు తాగుతుండగా.. విద్యుదాఘాతంతో మరణించిన విషయం తెలిసిందే..! ఈ అంశాన్ని కేరళ హైకోర్టు సుమోటోగా తీసుకుంది.
దీనిపై కోర్టు శుక్రవారం తీర్పును వెలువరిస్తూ.. యాత్రికుల భద్రత కోసం కేరళ వాటర్ అథారిటీ(కేడబ్ల్యూఏ), కేరళ రాష్ట్ర విద్యుత్తు బోర్డు(కేఎ్‌సఈబీ), ఇతర శాఖలు సంయుక్తంగా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కాగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అఖిల భారత అయ్యప్ప సేవాసంఘం దాఖలు చేసిన మాండమస్ రిట్ పిటిషన్‌లో ఇదే ధర్మాసనం ఇటీవల తీర్పునిస్తూ.. ఎరుమేళి, పంపా, శబరిమల సన్నిధానంలోని హోటళ్లు, అన్నదాన కేంద్రాల్లో వారానికి ఓ సారి తప్పనిసరిగా తనిఖీలు చేయాలని టీడీబీని ఆదేశించింది.