Share News

Pahalgam Hero Guide: గైడ్‌ కాదు దేవుడు

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:28 AM

పహల్గాం ఉగ్రదాడి సమయంలో ప్రాణాల పరవశంలోనూ విధేయతను చూపిన కశ్మీరీ గైడ్‌ నజకత్‌ షా, ముగ్గురు చిన్నారులతో పాటు 11 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడాడు. పర్యాటకుల భద్రతకే తన బాధ్యతగా భావించిన ఆయన, ప్రాణాలతో పోరాడుతూ ఆదర్శంగా నిలిచాడు

Pahalgam Hero Guide: గైడ్‌ కాదు దేవుడు

  • 11మంది పర్యాటకులను కాపాడిన కశ్మీరీ గైడ్‌ నజకత్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25: పహల్గాం ఉగ్రదాడి నుంచి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పర్యాటకులు, వారి పిల్లలను ఓ కాశ్మీరీ గైడ్‌ తన ప్రాణాలు ఫణంగా పెట్టి కాపాడాడు. ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్‌- చిర్మిరి- భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన 11 మంది కశ్మీర్‌ యాత్రకు వెళ్లారు. వీరిలో నలుగురు దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కశ్మీర్‌లో వీరికి నజకత్‌ అహ్మద్‌ షా(28) గైడ్‌గా వ్యవహరించారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో వారంతా బైసారన్‌ మైదానంలో ఫొటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ఇంతలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. పర్యాటకులంతా తలో దిక్కుకు పరిగెత్తడం గమనించిన నజకత్‌.. ముగ్గురు చిన్నారులను తీసుకొని ఒక చిన్న మార్గం నుంచి బయటపడ్డాడు.


ప్రమాదకరమైన కొండ దారుల్లో దాదాపు 14 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి పహల్గాం పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ సురక్షిత ప్రాంతంలో పిల్లలను ఉంచి మరోసారి వెనక్కువచ్చి మిగిలిన నాలుగు జంటలను కూడా కాపాడాడు. కాగా, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో తన మేనమామ కుమారుడు ఆదిల్‌ ముష్కరుల తూటాలకు బలయ్యాడని నజకత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్న పర్యాటకులు క్షేమంగా తిరిగి వెళ్లేవారకూ వారి వెంటే ఉండటం తన బాధ్యతగా భావించానని, అందుకే ఆదిల్‌ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని తెలిపారు.

Updated Date - Apr 26 , 2025 | 03:28 AM