Kartik Purnima: ఎల్లుండే కార్తీక పూర్ణిమ.. ఇలా పూజిస్తే విశేష ఫలితాలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:24 PM
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మహా శివుడికి మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని బ్రాహ్మణులు పేర్కొంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని పురాణాలు చెబుతున్నాయి. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నెలలో మహాదేవుడికి, విష్ణుమూర్తికి పూజలు చేస్తే జన్మజన్మల పాపం నశిస్తుందని సనాతన ధర్మం పాటించే భక్తులు విశ్వసిస్తారు. ఈ మాసం 15వ రోజున పౌర్ణమి వస్తుంది. ఈ రోజునే కార్తీక పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజును భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మహా శివుడికి మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని బ్రాహ్మణులు పేర్కొంటున్నారు.
ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి శివార్చన చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యం దక్కుతుంది. ఈ రోజును మహాశివరాత్రితో సమానమైన రోజుగా భావిస్తారు. అలాగే ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత ఇతిహాసానుసారం.. కార్తికేయుడు తారకాసురునివధించిన రోజే కార్తీక పౌర్ణమిగా చెబుతారు. ప్రజలను హింసిస్తున్న తారకాసురుడు భూభారహరణం జరగటంతో సంతోషంతో ఇంటికే ఇరువైపులా రాజ్య ప్రజలంతా దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాదేవుడు తాండవం చేశాడని పురాణాలు వర్ణిస్తున్నాయి.
కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట పర్వదినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠమని భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి. ఒళ్ళంతా నలుగుపిండి పెట్టుకొని ఉసిరికాయతో స్నానం చేస్తే మంచిదని చెబుతారు. స్నానం అనంతరం ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని బంతి పూలతో అలంకరించుకోవాలి. ఇంట్లోకి పూజాగదిని పూలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఇంట్లోని దేవతామూర్తులకు పూజలు చేసి దీపం వెలిగించాలి. స్వామివారికి ధూపం కూడా వేసి నైవేద్యం పెట్టాలి. ఇంట్లో నిత్యపూజ చేసిన తర్వాత ఉదయాన్నే తులసి పూజ చేయాలి. ఈరోజున తులసి పూజను చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. తులసి పూజ చేసి దీపం వెలిగించి ధూపం కూడా సమర్పించి నైవేద్యం నివేదించాలి.
ఆ తరువాత ఇంటిల్లిపాది అంతా తీపి పదార్థాల వంటలు చేసుకొని కుటుంబ సభ్యులు, బంధువులతో భోజనం చేయాలి. మధ్యాహ్న సమయంలో కార్తీక మాస విశిష్టత తీసుకొని విధిగా ఆచరించాలి. పురాణాలు, కథలు వినాలి. సాయంకాలం కూడా వీలైతే మళ్ళీ స్నానం చేసి సూర్యునికి ఆర్గ్యం ఇచ్చి ఇచ్చి దేవతారాధన చేసుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజున ఇంటి గుమ్మాలతోపాటు ఇంటి ఆవరణంలో మట్టి దీపాలు వెలిగించాలి. ఆవునేతితో గాని, నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, ఆముదం ఇలా ఏ నూనెనైనా తీసుకొని దీపాలు వెలిగించవచ్చు. దీపాల కాంతుల్లో చంద్రుని దర్శనం చేస్తూ వెన్నెలను ఆస్వాదిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
పండితులు తెలిపిన ప్రకారం పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30 గంటలకు మొదలవుతుంది. ఇది నవంబర్ 5 సాయంత్రం 6:48 వరకు వ్యాపించి ఉంటుంది. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం నవంబర్ 5నే ఎక్కువగా ఉంది కాబట్టి, ఆ రోజునే ఈ వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరమని వేద బ్రాహ్మణులు చెబుతున్నారు. బ్రాహ్మీ ముహూర్త సమయంలో అంటే నవంబర్ 5 ఉదయం 4:52 నుంచి 5:44 వరకు నదీ స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి. ఉదయం 7:58 నుంచి 9:00 వరకు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు దీపారాధన చేయడానికి అనువైన సమయం. ఈరోజున 365 వత్తులతో దీపారాధన చేసే ఏడాది కాలంగా ఇంట్లో దీపాన్ని వెలిగించని దోషాన్ని నివారించవచ్చు. సాయంత్రం ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి ఉసిరికాయ అంటే చాలా ప్రీతికావున ఉసిరి దీపం ధనలాభం, సౌభాగ్యం చేకూర్చుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే ఎంతో విశేష ఫలితాన్నిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
Devotional: యాత్రల మాసం... భోజనం ఎలా...