Vijayapura Accident: రోడ్డు ప్రమాదంలో కుటుంబం బలి
ABN , Publish Date - May 22 , 2025 | 04:55 AM
కర్ణాటకలో ఘోర రోడ్ ప్రమాదంలో ఒక కుటుంబం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం బలైంది. ఆ పరివారంలోని ఐదుగురిలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో కారు, బస్సు డ్రైవర్లు కూడా మృతిచెందారు.
డివైడర్‌ను దాటి బస్సును ఢీకొన్న కారు
వెనుక నుంచి బస్సును ఢీకొట్టిన కంటైనర్
కారులోని దంపతులు, ఇద్దరు పిల్లల మృతి
కారు డ్రైవర్, బస్సు డ్రైవర్ కూడా దుర్మరణం
కర్ణాటకలోని విజయపురా జిల్లాలో దారుణం
బాధిత కుటుంబానిది గద్వాల జిల్లా కేంద్రం
గద్వాల క్రైం/బెంగళూరు, మే 21 (ఆంధ్రజ్యోతి): దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం బలైంది. ఆ పరివారంలోని ఐదుగురిలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో కారు, బస్సు డ్రైవర్లు కూడా మృతిచెందారు. బాధిత బంధువుల వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన తెలుగు భాస్కర్(42) బ్యాంకు ఉద్యోగి. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కుర్తిలో విధులు నిర్వహించిన ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు. ఈ సంతోషంలో భార్య పవిత్ర (36), కుమారుడు అభిరామ్ (14), ప్రవీణ్, కూతురు జోత్స్న (12)తో కలిసి కర్ణాటకలోని మురుడేశ్వరి దేవాలయానికి ఆయన వెళ్లాలనుకున్నాడు. బుధవారం డ్రైవర్ శివప్పను మాట్లాడుకొని అందరూ కలిసి కారులో బయలుదేరారు. కర్ణాటకలోని మునగులి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఆ బస్సు వెనుక వస్తున్న కంటైనర్ లారీ బస్సును ఢీ కొట్టి రోడ్డుపక్కకు దూసుకుపోయింది. ఈ ఘటనలో బాస్కర్, పవిత్ర, అభిరామ్, జోత్స్న, కారు డ్రైవర్ శివప్ప, బస్సు డ్రైవర్ బసవరాజ్ రాథోడ్ అక్కడికక్కడే మృతిచెందాడు. భాస్కర్ చిన్న కుమారుడు, ప్రవీణ్(10)కు గాయాలయ్యాయి. ఆ బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సులోని పలువురికి గాయాలయ్యాయి.