Karnataka: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై చర్చలు లేవు
ABN , Publish Date - Jul 02 , 2025 | 06:16 AM
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఎటువంటి చర్చలు లేవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ రణదీప్‌సింగ్ సుర్జేవాలా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సుర్జేవాలా
బెంగళూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఎటువంటి చర్చలు లేవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ రణదీప్‌సింగ్ సుర్జేవాలా అన్నారు. రెండురోజులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో వేర్వేరుగా సుర్జేవాలా భేటీ అవుతున్నారు. నాయకత్వ మార్పుకే ఈ ప్రక్రియ సాగుతోందనే ప్రచారంపై సుర్జేవాలా మంగళవారం మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య విభేదాలు తలెత్తాయని, దీనికి కారణాలు తెలుసుకునేందుకే వచ్చానని పేర్కొన్నారు. శాసనసభ్యుల అభిప్రాయ సేకరణ అనేది లేదని కొట్టిపారేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందని నియోజకవర్గాలవారీగా తెలుసుకుంటున్నామని, నియోజకవర్గాల్లో సమస్యలు, ఇచ్చిన హామీలలో పెండింగ్ ఉన్నాయా అనే అంశాల గురించి విచారిస్తున్నామని వివరించారు. 5 గ్యారెంటీలు ఎప్పుడూ రద్దు చేయబోమని తేల్చి చెప్పారు.