Karnataka: ఐదేళ్లూ నేనే ముఖ్యమంత్రి: సిద్దరామయ్య
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:16 AM
నాయకత్వ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు.
ఆయనకు మద్దతివ్వడం తప్ప మరో దారి లేదు: డీకే
బెంగళూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): నాయకత్వ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. చిక్కబళ్లాపురలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని, ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని స్పష్టంచేశారు. బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో దిట్టలని, నిజాలు చెప్పడం వారికి తెలియదని విమర్శించారు. తన నాయకత్వంపై పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. పార్టీ కోసం శ్రమించిన డీకే శివకుమార్‌ను గుర్తించి, ఆయనను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు కదా అని మీడియా ప్రశ్నించగా.. అందరూ ఎంతో కష్టపడ్డారని, తాను ఒంటరివాడిని కాదని సిద్దరామయ్య పేర్కొన్నారు.
మరోవైపు, సిద్దరామయ్యకు మద్దతు ఇవ్వడం తప్ప తనకు మరో మార్గం లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టంచేశారు. చిక్కబళ్లాపుర జిల్లా నందిహిల్స్‌పై జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్‌కు హాజరయ్యే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సిద్దరామయ్యకు అండగా ఉండి సహకరిస్తానని తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఓవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణదీ్‌పసింగ్ సుర్జేవాలా బెంగళూరులో ఎమ్మెల్యేలతో చర్చలు కొనసాగిస్తుండగానే డీకే శివకుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.