Karnataka CM: మరో ఐదేళ్లు నేనే సీఎం: సిద్దరామయ్య
ABN , Publish Date - Mar 13 , 2025 | 06:06 AM
‘ప్రస్తుత ప్రభుత్వంలోనే కాదు... మరో ఐదేళ్లు నేనే సీఎం’ అంటూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యారెంటీల అమలు కమిటీని రద్దు చేయాలని శాసనసభలో ప్రతిపక్షాలు బుధవారం ఆందోళన చేస్తున్న సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘ప్రస్తుత ప్రభుత్వంలోనే కాదు... మరో ఐదేళ్లు నేనే సీఎం’ అంటూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యారెంటీల అమలు కమిటీని రద్దు చేయాలని శాసనసభలో ప్రతిపక్షాలు బుధవారం ఆందోళన చేస్తున్న సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత అశోక్ మాట్లాడుతూ, ఇక్కడ పర్మనెంట్ అని చెప్పుకొనేవారు కనిపించకుండా పోయారని కన్నడలో ఓ పాట ఉందని (కనిపించకుండా మాయమైన శివుడు) అన్నారు.
దీనికి సీఎం దీటుగా స్పందిస్తూ... మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈసందర్భంలో సీనియర్ సభ్యుడు సునిల్‌కుమార్ మాట్లాడుతూ ‘కాంగ్రెస్ వస్తుంది... మీరుంటారా..?’ అని ప్రశ్నించారు. దీంతో తానే మరో ఐదేళ్లు సీఎంగా ఉంటానని సిద్దూ బదులిచ్చారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఎప్పుడైనా ఉండవచ్చునన్న ఊహాగానాల నేపథ్యంలో సిద్దరామయ్య వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.