Actress Nandhini CM: ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య.. సినిమాల కోసం గవర్నమెంట్ జాబ్ కాదని..
ABN , Publish Date - Dec 30 , 2025 | 03:35 PM
ప్రముఖ కన్నడ సీరియల్ నటి కెంగెరిలోని పేయింగ్ గెస్ట్ హాస్టల్‌లోని గదిలో ఆమె శవమై తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కన్నడ బుల్లితెర పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీరియల్ నటి నందిని సీఎం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. కెంగెరిలోని పేయింగ్ గెస్ట్ హాస్టల్‌లోని గదిలో ఆమె శవమై తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నందిని చనిపోయిన గదిలో పోలీసులకు ఓ నోట్ లభించింది. సూసైడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఏం తేలిందంటే.. డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11.16 గంటల నుంచి 12.30 మధ్య ఆమె చనిపోయింది.
మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే వారు అక్కడికి వెళ్లారు. రూము నెంబర్ 202లో ఆమె విండో ఫ్రేమ్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆ పెయింగ్ గెస్ట్ హాస్ట్‌ల్లో నందిని 2025 ఆగస్టు నుంచి ఉంటోంది. ఇక, కూతురి మరణంపై నందిని తల్లి జీఆర్ బసవరాజేశ్వరి కెంగేరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నందిని మరణంపై తమకు ఎవ్వరి మీద అనుమానం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. నందిని మరణం గురించి ఎలాంటి అనుమానాలు లేకపోయినప్పటికి ప్రొసిజర్ ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ అనిత హద్దన్నవర్ తెలిపారు.
నటన కోసం గవర్నమెంట్ జాబ్‌ను కాదని..
నందిని బళ్లారిలో పుట్టింది. 2018లో డిగ్రీ విద్యను పూర్తి చేసింది. యాక్టింగ్ మీద ఆసక్తితో పై చదువులు వద్దనుకుంది. 2019లో బెంగళూరుకు వచ్చేసింది. కన్నడతో పాటు తమిళ బుల్లితెరలో కూడా అవకాశాలు దక్కించుకుంది. జీవ హూవాగిదే, మధుమగలు, నీనాదే నా, సంఘర్షణ వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2023లో ఆమె తండ్రి మరణించాడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. మరణం తర్వాత ఆయన ఉద్యోగం నందినికి వచ్చే అవకాశం ఉండింది. అయితే, యాక్టింగ్ కారణంగా ఆ ఉద్యోగానికి ఆమె నో చెప్పింది. మరణానికి ముందు ఆమె తమిళంలో గౌరీ అనే సీరియల్ చేస్తూ ఉంది. ఆ సీరియల్‌లో ద్విపాత్రాభినయం చేస్తూ ఉంది. అంతా సజావుగా సాగుతున్న ఆమె జీవితంలో ఇలాంటి విషాదాన్ని ఎవ్వరూ ఊహించలేదు.
ఇవి కూడా చదవండి
దేశంలోనే చంద్రబాబుది ప్రత్యేక స్థానం: ఎంపీ కేశినేని
ప్రియాంక గాంధీ కోడలిగా అవివా బేగ్.. అసలెవరీ అవివా బేగ్?