Kailash Mansarovar Yatra 2025: డ్రా ద్వారా కైలాస యాత్రకు యాత్రికుల ఎంపిక.. ఎప్పుడంటే..
ABN , Publish Date - May 20 , 2025 | 07:02 PM
Kailash Mansarovar Yatra 2025: ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనే యాత్రికుల పేర్లను డ్రా తీయనున్నారు. ఈ యాత్ర ఎన్ని రోజులు పడుతుంది. ఎంత ఖర్చవుతుందంటే..
న్యూఢిల్లీ, మే 20: దాదాపు ఐదేళ్ల అనంతరం కైలాస మాసన సరోవర్ యాత్రను ఈ ఏడాది చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాత్ర చేయనున్న యాత్రికుల పేర్లను బుధవారం డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. కంప్యూటర్ డ్రా ద్వారా యాత్రికులను విదేశాంగ శాఖ ఎంపిక చేయనుంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ ఆధ్వర్యంలో ఈ డ్రా జరగనుంది. ఈ డ్రా ద్వారా ఎంపికైన యాత్రికులకు సమాచారం అందించడంతోపాటు.. ఈ యాత్రకు ప్రత్యేక మార్గదర్శకాలను విదేశాంగ శాఖ నిర్దేశించనుంది.
ఐదేళ్ల విరామం తర్వాత కైలాస మానసరోవర్ యాత్ర జరగనుంది. ఈ యాత్ర ఫీజును చైనా భారీగా పెంచింది. ఈ కైలాస యాత్ర ప్రయాణం రెండు మార్గాల ద్వారా జరుగుతుంది. మొదటిది ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ మార్గం ద్వారా కాగా.. మరొకటి నాథులా పాస్ ద్వారా ఈ యాత్ర చేస్తారు.
లిపులేఖ్ మార్గానికి ఖర్చు ఎంతవుతుందంటే..
ఈ మార్గం ద్వారా ప్రయాణానికి రూ.1. 84 లక్షలు ఖర్చవుతుంది. అందులో రూ. 95 వేలు చైనా రుసుముగా వసూలు చేస్తోంది. 2019లో ఈ ఖర్చు రూ.1. 30 లక్షలు అయ్యేది. అప్పట్లో చైనా వసులు చేసే రుసుం రూ.77 వేలుగా ఉండేది.
నాథులా పాస్ ద్వారా ఎంతంటే..
నాథులా పాస్ ద్వారా ప్రయాణించడానికి ఒక్కో ప్రయాణీకుడి నుంచి రూ. 2. 05 లక్షలు చైనా వసూలు చేస్తుంది. ఈ మార్గం ద్వారా ప్రయాణానికి మొత్తం రూ. 2. 84 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఈ రెండు మార్గాల ద్వారా ఖర్చు రూ.17000 నుండి రూ.25,000కి పెరిగినట్లు అయింది.
వాతావరణ అనుకూల కేంద్రాలు..
మౌలిక సదుపాయాల అభివృద్ధిని సిక్కిం ప్రభుత్వం వేగవంతం చేసింది. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌తోపాటు నాథు లా పాస్ మధ్య వాతావరణ అనుకూల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ యాత్ర ఎన్ని రోజులంటే..
గతంలో.. లిపులేఖ్ నుంచి కైలాస మానస సరోవర్ ప్రయాణానికి 20 నుంచి 21 రోజులు పట్టేది. అది ఈ సారి 23 రోజులు పట్టనుంది. అందుకు కారణం.. ఢిల్లీలో 12 రోజులు గడిపిన ప్రయాణికులు. టిబెట్‌లో తొమ్మిది రోజులు మాత్రమే గడుపుతారు. ఇక నాథు లా పాస్ నుంచి ప్రయాణం 25 రోజులు పట్టనుంది. గతంలో ఈ మార్గం ద్వారా ప్రయాణానికి 23 రోజులు పట్టేది. ఈ సారి ప్రయాణికులు 10 రోజులు టిబెట్‌లో.. 15 రోజులు భారతదేశంలో గడపనున్నారు.
ఈ ఏడాది ఈ యాత్ర ఎప్పుడు..
ఈ ఏడాది జూన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమై.. ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో దాదాపు 250 మంది ప్రయాణికులు కైలాస మానస సరోవర్‌ను సందర్శించే అవకాశం ఉంది.
కైలాష్ మానస సరోవర్ యాత్రకు రిజిస్ట్రేషన్
విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ https://kmy.gov.in ని సందర్శించడం ద్వారా ఈ యాత్రకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రతి ఏడాది దరఖాస్తు ప్రక్రియ మార్చి నుండి ఏప్రిల్ వరకు జరుగుతుంది. ఈ ఏడాది ఈ యాత్రకు రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ మే 13. ఇక ఈ యాత్ర రిజిస్ట్రేషన్‌కు పాస్ పోర్ట్, ఫిట్ నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Minister Sridhar Babu: కేసీఆర్‌కు నోటీసులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
AP I CET 2025 Result: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
United Nations: మరో 48 గంటల్లో మరణించనున్న 14 వేల చిన్నారులు
For National News And Telugu News