Share News

Indian Parliament Monsoon Session: అభిశంసనకు సిద్ధం

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:09 AM

ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన..

Indian Parliament Monsoon Session: అభిశంసనకు సిద్ధం
Indian Parliament Monsoon Session

  • జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను తొలగించాలన్న తీర్మానం..

  • నోటీసుపై 100 మందికి పైగా ఎంపీల సంతకాలు

  • రిజిజు అధ్యక్షతన అఖిలపక్ష భేటీ.. నేటి నుంచి పార్లమెంటు

  • 8 ప్రధాన అంశాలపై నిలదీస్తామని ప్రతిపక్షాల ప్రకటన

  • తానే యుద్ధం ఆపానన్న ట్రంప్‌ ప్రకటనపైనా సభలో చర్చ

న్యూఢిల్లీ, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధమైంది. జస్టిస్‌ వర్మపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టే విషయంలో అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని, కేవలం ప్రభుత్వమే నిర్ణయాన్ని వెల్లడించబోదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు తెలిపారు. ఈ తీర్మానానికి సంబంధించిన నోటీసుపై ఇప్పటికే 100 మందికిపైగా ఎంపీలు సంతకాలు చేశారని వెల్లడించారు. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి 54 పార్టీలు హాజరుకాగా దాదాపు 40 మంది నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారని పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని రాజ్య సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు అధ్యక్షత వహించారు. సభ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలను అభ్యర్థించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సహా అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కిరెణ్‌ రిజిజు మీడియాకు చెప్పారు. సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి ఉభయ సభలు సజావుగా జరిగేలా చూడటం అన్ని పార్టీల బాధ్యత అని అన్నారు. భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణకు తానే సంధి కుదిరేలా చేశానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనపై కూడా ప్రభుత్వం సభలో స్పందిస్తుందని తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ద్వారా ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశీ పర్యటనకు వెళ్లిన రోజుల్లో తప్ప ప్రధాని ఢిల్లీలో ఉంటే పార్లమెంట్‌ సమావేశానికి తప్పకుండా హాజరవుతారని వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయనకు సంబంధించిన ప్రశ్న ఉంటే మోదీ స్వయంగా సమాధానమిస్తారని తెలిపారు. రాజ్యసభలో బీజేపీ పక్ష నేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ ప్రభుత్వం తరఫున అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేశ్‌, గౌరవ్‌ గొగోయ్‌, ఎన్సీపీ నేతలు శరద్‌ పవార్‌, సుప్రియా సూలే, డీఎంకే నేత టీఆర్‌ బాలు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. కాగా, సోమవారం నుంచి ఆగస్టు 21 వరకు జరిగే ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు పన్ను చట్టాల సవరణ బిల్లు, జన విశ్వాస్‌ సవరణ, ఐఐటీ యాజమాన్య సవరణ, గనుల అభివృద్ధి సవరణ, మణిపూర్‌ జీఎస్టీ సవరణ బిల్లు, జాతీయ క్రీడా పాలనా బిల్లు, మర్చంట్‌ షిప్పింగ్‌ బిల్లు, భారత రేవుల బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసింది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కుడా ప్రభుత్వం చేపట్టబోయే చర్యలను ఈ సమావేశంలో ప్రకటించే అవకాశాలున్నాయి.


బిహార్‌ పరిణామాలపై విపక్షాల ఆందోళన

అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఎనిమిది ప్రధాన అంశాలపై వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నామని విపక్షాలు ప్రకటించాయి. ముఖ్యంగా పహల్గామ్‌ ఘటన, మన దౌత్య విధానం విఫలం కావడం, ట్రంప్‌ ప్రకటనలు, బిహార్‌లో ఎన్నికల జాబితా సవరణపై ప్రధాని మోదీ స్వయంగా సభకు వివరించాలని బిహార్‌ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో జూలై 23, 24 తేదీల్లో మోదీ మాల్దీవులు, బ్రిటన్‌ పర్యటనకు వెళ్లడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ పేరిట జరుగుతున్న తంతుపై అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ఆందోళన వెలిబుచ్చాయి. దీనిపై ప్రత్యేక చర్చ కావాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయగా, ఆ అంశం కోర్టు పరిశీలనలో ఉందని ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం. బిహార్‌లో పెద్ద ఎత్తున ఓటర్లను జాబితా నుంచి తొలగించడంపై ప్రతిపక్షాలు సభను స్తంభింపచేసే అవకాశాలున్నాయి. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తికాకముందే పైలట్లను నిందించేలా తాత్కాలిక నివేదికను బయటపెట్టడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పహల్గామ్‌ ఘటన, ఆపరేషన్‌ సిందూర్‌లో ట్రంప్‌ దౌత్యం, బిహార్‌లో ఓటర్ల జాబితాపై సభకు మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌, సీపీఐ(ఎం) నేత జాన్‌ బ్రిటాస్‌, సమాజ్‌వాదీ నేత రాంగోపాల్‌ యాదవ్‌, సీపీఐ నేత సందోశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

నదుల అనుసంధానంపై చర్చించాలి: సురేశ్‌ రెడ్డి

నదుల అనుసంధానంపై చర్చ జరగాలని బీఆర్‌ఎస్‌ రాజ్యసభ పక్ష నేత సురేశ్‌ రెడ్డి కోరారు. ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానానికి బీఆర్‌ఎస్‌ వ్యతిరేకం కాదని, కానీ తెలంగాణ నీళ్లను అక్రమంగా తరలిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలకు సంఖ్యా బలంతో సంబంధం లేకుండా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని, అప్పుడే రాష్ట్రాల సమస్యలు చర్చకు వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎరువుల కొరతకు పరిష్కారం చూడాలన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి నష్టం జరుగుతుందనే ఆందోళన ఉందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని సురేశ్‌రెడ్డి కోరారు.

Updated Date - Jul 21 , 2025 | 04:09 AM