Justice Bhushan Gavai: సీజేఐ జస్టిస్ గవాయ్
ABN , Publish Date - May 15 , 2025 | 03:06 AM
భూషణ్ రామకృష్ణ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. జస్టిస్ గవాయ్ బౌద్ధమతాన్ని అవలంబించే తొలి సీజేఐగా, అలాగే దళితవ్యక్తిగా రెండో సీజేఐగా సత్కరించబడ్డారు.
ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము
హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు
తొలి బౌద్ధ, రెండో దళిత సీజేఐగా రికార్డు
1985లో న్యాయవాదిగా కెరీర్ ఆరంభం
2003లో హైకోర్టు.. 2019లో సుప్రీం జడ్జిగా..
ఆర్టికల్ 370 రద్దు, బుల్డోజర్ న్యాయం
తదితర కీలక తీర్పుల్లో భాగస్వామ్యం
న్యూఢిల్లీ, మే 14: జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా బుధవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్ చేత ఈ మేరకు ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం జస్టిస్ గవాయ్ తన తల్లి కమల్‌తాయి గవాయ్‌కి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, జేపీ నడ్డా, అర్జున్‌రాం మేఘ్వాల్, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, విపక్షనేత రాహుల్‌గాంధీ తదితరులు హాజరయ్యారు. 64 ఏళ్ల వయసున్న జస్టిస్ గవాయ్.. ఈ ఏడాది నవంబరు 23 వరకూ సీజేఐ పదవిలో కొనసాగనున్నారు. కాగా, జస్టిస్ గవాయ్ బౌద్ధమతావలంబకులు. తద్వారా దేశ తొలి బౌద్ధ సీజేఐగా నిలిచారు. అంతేకాదు జస్టిస్ బాలకృష్ణన్ తర్వాత సీజేఐ పదవిని చేపట్టిన రెండో దళితవ్యక్తిగా పేరొందారు.

జస్టిస్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతికి చెందినవారు. ఆయన తండ్రి ఆర్‌ఎస్ గవాయ్ సీనియర్ రాజకీయ నాయకుడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయ్) పార్టీని స్థాపించి దళిత వర్గాల నేతగా పేరొందారు. 1985లో భూషణ్ రామకృష్ణ గవాయ్ న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1992-93లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 2000లో ప్రభుత్వ ప్లీడర్‌గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పదోన్నతి పొందారు. 2003లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 మే24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపొందారు. సీజేఐగా మం గళవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజీవ్‌ఖన్నా అదే ఏడాది అదేరోజు సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.
700 ధర్మాసనాల్లో భాగస్వామి
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ గత ఆరేళ్లలో దాదా పు 700 ధర్మాసనాల్లో ఉన్నారు. దాదాపు 300 తీర్పులను స్వయంగా రాశారు. పలు కీలక తీర్పుల్లో ఆయన భాగస్వామి. వాటిలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చిన ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేయటానికి సమర్థన, పెద్దనోట్ల రద్దు సబబేనని తీర్పు, ఎన్నికల బాండ్లరద్దు, బుల్డోజర్లతో ప్రభుత్వమే నిందితుల ఇళ్ల ను కూల్చటాన్ని నిలిపివేస్తూ తీర్పు.. ఉన్నాయి. ఇటీ వల అలహాబాద్ హైకోర్టు జడ్జి ఒకరు.. నిందితుడు ఓ మహిళ పైజామా తాడు లాగటం, ఛాతిని తాకటం రేప్ కిందకు రాదంటూ ఇచ్చిన తీర్పును జస్టిస్ గవాయ్ సారథ్యంలోని బెంచ్ నిలిపేసింది.
జై భీం అంటూ పలకరింపు
సీజేఐగా ప్రమాణం అనంతరం సుప్రీంకోర్టులో తనను న్యాయవాదులు కలిసిన సందర్భంగా జస్టిస్ గవాయ్.. ‘జై భీం’ అంటూ వారిని పలకరించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనల స్ఫూర్తితో ‘జై భీం’ నినాదం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. కాగా, సీజేఐగా ప్రమాణం చేయటానికి కొన్ని రోజుల ముందు తన నివాసంలో జస్టిస్ గవాయ్ విలేకర్లతో మాట్లాడుతూ.. సీజేఐగా తనకు రాజ్యాంగమే అత్యున్నత ప్రమాణంగా ఉంటుందని స్పష్టం చేశారు. పదవీ విరమణ తర్వాత ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టబోనని చెప్పారు. తాజాగా, రిటైర్డ్ అయిన సీజేఐ సంజీవ్‌ఖన్నా కూడా ఏ పదవీ చేపట్టనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News