Mistaken Lover Assault: భార్య ప్రియుడ్ని చావగొట్టిన వ్యక్తి.. ట్విస్ట్ మామూలుగా లేదు..
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:11 PM
ఆ వ్యక్తి పరుగున హోటల్ దగ్గరకు వెళ్లాడు. భార్య ఓ యువకుడి పక్కన కనిపించింది. అంతే ఆ వ్యక్తి రెచ్చిపోయాడు. భార్య పక్కన ఉన్న యువకుడ్ని రోడ్డుపైకి లాక్కుని వచ్చి కొట్టడం మొదలెట్టాడు.
ఓ వ్యక్తి తన భార్యను ప్రియుడితో హోటల్‌లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్య ప్రియుడ్ని రోడ్డుపై పడేసి చావగొట్టాడు. పోలీసుల ఎంట్రీ తర్వాత ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. అసలు విషయం తెలిసి భర్త షాక్ అయ్యాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఝాన్సీకి చెందిన ఓ వ్యక్తికి తన భార్య ఎవరితోనో సంబంధం పెట్టుకుందన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం రోజు రోజుకు పెరిగి పెనుభూతంగా మారింది.
కొద్దిరోజుల క్రితం ఆ వ్యక్తికి బంధువు నుంచి ఫోన్ వచ్చింది. ‘నీ భార్య హోటల్‌లో ఓ యువకుడితో ఉంది’ అని ఆ బంధువు చెప్పాడు. ఆ వ్యక్తి పరుగున హోటల్ దగ్గరకు వెళ్లాడు. భార్య ఓ యువకుడి పక్కన కనిపించింది. అంతే ఆ వ్యక్తి రెచ్చిపోయాడు. భార్య పక్కన ఉన్న యువకుడ్ని రోడ్డుపైకి లాక్కుని వచ్చి కొట్టడం మొదలెట్టాడు. ఆ వ్యక్తి కుటుంబసభ్యులు కూడా అక్కడికి వచ్చారు. యువకుడ్ని కొట్టడం మొదలెట్టారు. ఈ విషయం తెలిసి యువకుడి తండ్రి, సోదరుడు అక్కడికి వచ్చారు. గొడవను ఆపే ప్రయత్నం చేశారు.
ఆ ఇద్దరిపై కూడా వారు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవను ఆపి, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. పోలీసుల దర్యాప్తులో ఆ వ్యక్తి భార్యకు యువకుడికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. అపార్థం కారణంగా ఈ మొత్తం దారుణం జరిగిందని వెల్లడైంది. యువకుడితో పాటు అతడి తండ్రి, సోదరుడిపై దాడి చేసిన మొత్తం ఎనిమిది మందిపై చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి
మీ బ్రెయిన్ చురుకైనది అయితే.. ఈ ఫొటోలో ఎన్వలప్ కవర్‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత.. ఆ కొద్ది సేపటికే..