Jagannath Rath Yatra : జగన్నాథ రథయాత్ర.. చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి..
ABN , Publish Date - Jun 27 , 2025 | 02:02 PM
ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరుగుతోంది. జగన్నాథుని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అయితే, జగన్నాథ రథయాత్ర చరిత్ర ఏమిటి? అలాగే, ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Jagannath Rath Yatra: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి తరలివచ్చారు. జై జగన్నాథ అంటూ భక్తుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. ఈ పండుగను ఏటా ఆషాడ మాస శుక్లపక్ష విదియ నాడు జరుపుతారు. ఈ 9 రోజుల ఉత్సవంలో భాగంగా, జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి 12వ శతాబ్దానికి చెందిన ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయానికి యాత్రగా వెళ్తారు. పురాణాల ప్రకారం గుండిచా ఆలయాన్ని స్వామి వారి జన్మస్థలంగా భక్తులు నమ్ముతారు.
హిందూ పవిత్ర గ్రంథాల ప్రకారం, జగన్నాథుని సోదరి సుభద్ర పూరీకి ప్రయాణించాలని కోరుకుందని చెబుతారు. దేవి సుభద్ర కోరికను తీర్చడానికి, జగన్నాథుడు, అతని అన్నయ్య బలభద్రుడు పూరీకి రథం నడిపారు. పూరీ జగన్నాథ రథయాత్ర ప్రస్తావన బ్రహ్మ పురాణం, పద్మ పురాణం వంటి పురాతన గ్రంథాలలో ఉంది. ఇది 460 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని నమ్ముతారు. జగన్నాథ రథయాత్ర గురించి అనేక ఇతిహాసాలు ఉన్నప్పటికీ, ప్రసిద్ధమైన వాటిలో ఒకదాని గురించి తెలుసుకుందాం.. పూరి జగన్నాథ ఆలయాన్ని ఇంద్రద్యుమ్న రాజు నిర్మించాడు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను గుండిచ ఆలయంలో విశ్వకర్మ తయారు చేశాడు. రాణి గుండిచ ఇంద్రద్యుమ్న భార్య. రాణి గుండిచకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, ప్రతి సంవత్సరం రథయాత్ర సమయంలో దేవతలు గుండిచా ఆలయం సందర్శిస్తారు.
పురాణాల ప్రకారం, ఇంద్రద్యుమ్న రాజుకు ఒక కల వచ్చింది. అందులో జగన్నాథుడు కనిపించి ఒడ్డున దొరికే చెక్క దుంగ నుండి తన విగ్రహంను తయారు చేయాలని కోరుకున్నాడు. రాజు ఆ దుంగను చూసి విగ్రహాలను చెక్కడానికి తగిన మనిషి కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, అతనికి తగిన వారు ఎవరూ దొరకలేదు. అప్పుడే, విశ్వకర్మ విగ్రహాలను తయారు చేయడానికి అంగీకరించాడు. కానీ, అతను ఒక షరుతు పెట్టాడు. అతను తయారుచేసేటప్పుడు ఎవరు విగ్రహాలను చూడకూడదని, తలుపులు మూసివున్న గదిలో విగ్రహాలను తయారు చేస్తానని, విగ్రహాలు పూర్తయ్యే వరకు ఎవరినీ లోపలికి అనుమతించనని చెప్పాడు. అయితే, రాజు మొదట్లో అంగీకరించాడు. కానీ, తరువాత ఆందోళన చెంది తలుపు తెరిచాడు. దీంతో విశ్వకర్మకు కోపం వచ్చి ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయాడని, అలా విగ్రహాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే, విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నప్పటికీ, నేటికీ వాటిని ఆ రూపంలోనే పూజిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:
కేరళలో 15 రోజులుగా యూకే యుద్ధ విమానం.. రిపేర్ల కోసం త్వరలో బ్రిటన్ ఇంజినీర్ల రాక
హైదరాబాదు- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు
For More National News