Share News

Jagannath Rath Yatra: కదిలిన జగన్నాథుడి రథచక్రాలు

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:36 AM

ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో జగన్నాథ రథయాత్ర శక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.

Jagannath Rath Yatra: కదిలిన జగన్నాథుడి రథచక్రాలు

పూరీ, జూన్‌ 27: ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో జగన్నాథ రథయాత్ర శక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. పూరీ రహదారులపై స్వామివారు, ఆయన తోబుట్టువులైన బలభద్రుడు, సుభద్ర అధిష్ఠించిన రథాలను లాగడానికి వేలాది మంది భక్తులు బారులుతీరారు. వీరిలో ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. అంతకుముందు ప్రధాన ఆలయం నుంచి దేవతామూర్తులను రథాల వద్దకు తీసుకొచ్చే పహండీ వేడుకలో భాగంగా తొలుత బలభద్రుడిని తాళధ్వజ రథంపైకి, సుభద్రను దర్పదలన్‌ రథంపైకి చేర్చారు. చివరగా భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథుడు తన నందిఘోష రథం వద్దకు చేరుకున్నారు. రథాలను అధిష్ఠించిన దేవతామూర్తులను పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి(81) దర్శించుకున్నారు.


కొద్దిమంది శిష్యులతో కలసి వీల్‌చైర్‌లో వచ్చిన ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌ దేవ్‌ ‘చెరా పహరా’ క్రతువును పూర్తి చేశారు. దీనిలో భాగంగా మూడు రథాల లోపల, అవి ప్రయాణించే మార్గాన్ని ఆయన బంగారు చీపురుతో ఊడుస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రథాలకు వివిధ రంగుల చెక్క గుర్రాలను అమర్చారు. అనంతరం సాయంత్రం 4.08 గంటలకు ‘జై జగన్నాథ’ నినాదాల మధ్య బలభద్రుడి తాళధ్వజం ముందు కదలగా ఆ వెనుక దర్పదలన్‌, చివరగా నందిఘోష అనుసరించాయి. జగన్నాథుడి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ఊరేగింపు అక్కడకు 2.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం వద్ద ముగుస్తుంది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, పూరీ ఎంపీ సంబిత్‌ పాత్రా, పలువురు ఒడిశా మంత్రులు పహండీ వేడుకను వీక్షించారు.


అహ్మదాబాద్‌ రథయాత్రలో అపశ్రుతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపులో పాల్గొన్న ఏనుగు అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. అహ్మదాబాద్‌లో 400 ఏళ్ల నాటి పురాతన జగన్నాథ ఆలయంలో ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నారు.

Updated Date - Jun 28 , 2025 | 05:36 AM