ISRO: గురితప్పిన ఇస్రో బాణం
ABN , Publish Date - May 19 , 2025 | 05:07 AM
ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ61 రాకెట్ ప్రయోగం మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో విఫలమైంది. ఈవోఎస్-09 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టే మిషన్ మధ్యలోనే నిలిచిపోయింది.
పీఎ్‌సఎల్వీ-సీ61 మూడో దశలో సాంకేతిక సమస్య.. రాకెట్ కూల్చివేత
సూళ్లూరుపేట, మే 18 (ఆంధ్రజ్యోతి): ఇస్రోకు తిరుగులేని విజయాలు అందించిన పీఎ్‌సఎల్వీలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. సాంకేతిక సమస్యతో ఇస్రో బాణం గురితప్పింది. శ్రీహరికోట నుంచి 101వ అంతరిక్ష ప్రయోగంగా ఇస్రో చేపట్టిన పీఎ్‌సఎల్వీ-సీ61 ప్రయోగం విఫలమైంది. సరిహద్దులపై నిఘా కోసం రూపొందించిన ఈవోఎస్-09 (రీశాట్-1బీ) ఉపగ్రహాన్ని తీసుకుని భారీ అంచనాలతో నింగిలోకి ఎగిరిన పీఎ్‌సఎల్వీ-సీ61 సాంకేతిక సమస్య కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రాకెట్ ప్రయాణ గమన దిశ మారింది. సాంకేతిక సమస్యను గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ దిశను మార్చి నిర్దేశిత మార్గంలోకి తీసుకొచ్చేలా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈ మిషన్‌ను అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. ప్రామాణిక భద్రత ప్రొటోకాల్‌ను అనుసరించి సాంకేతిక సమస్యను గుర్తించిన తర్వాత రాకెట్‌లోని నాలుగో దశ, పేలోడ్ (ఈవోఎ్‌స-09)లను పేల్చివేశారు.

అనంతరం మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో చైర్మన్ నారాయణన్ దీనిపై ప్రకటన చేశారు. పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ఈవోఎస్-09 ఉపగ్రహాన్ని 524 కిలోమీటర్ల దూరంలోని సూర్య-సమకాలీన కక్ష్యలోకి చేర్చాలని ఇస్రో భావించింది. దీనిలో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ సాయంతో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ హై రిజల్యూషన్‌తో కూడిన చిత్రాలను తీయవచ్చు.
పీఎ్‌సఎల్వీకి మూడో పరాజయం
అంతకుముందు శనివారం ఉదయం 7:59 గంటలకు ప్రారంభమైన 22 గంటల కౌంట్‌డౌన్ పూర్తవగానే ఆదివారం ఉదయం 5:59 నమిషాలకు షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పయనమైంది. 8 నిమిషాలకు తన రెండు దశలను సునాయసనంగా పూర్తి చేసుకొంది. మూడో దశలోకి ప్రవేశించగానే సాంకేతిక సమస్య తలెత్తింది. ఘన హైడ్రాక్సిల్-టెర్మినేటెడ్ పాలిబ్యూటాడిన్ (హెచ్‌టీపీబీ) మోటారుతో నడిచే మూడో దశ (పీఎస్3) సరిగ్గా పనిచేయలేదు. దీంతో రాకెట్ గతి తప్పింది. పీఎస్3 దశకు సంబంధించిన డేటా, తయారీ రికార్డులను పరిశీలించేందుకు ఇస్రో ఒక వైఫల్య విశ్లేషణ కమిటీని ఏర్పాటు చేసింది. పీఎ్‌సఎల్వీ శ్రేణిలో ఇస్రో ఇప్పటివరకూ 63 ప్రయోగాలు చేపట్టగా.. ఇది మూడో వైఫల్యమేనని, 2017 తర్వాత పీఎ్‌సఎల్వీ రాకెట్ విఫలమవడం ఇదే తొలిసారని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
60 విజయాలు.. 3 వైఫల్యాలు
1969 ఆగస్టు 15న ప్రారంభమైన ఇస్రో.. 1993లో పీఎ్‌సఎల్వీ రాకెట్ ప్రయోగాలకు ఇస్రో శ్రీకారం చుట్టింది. పీఎ్‌సఎల్వీ-డీ1 పేరిట 1993 సెప్టెంబరు 20న తొలి ప్రయోగం చేపట్టగా.. నాలుగో దశలో ద్రవ ఇంధనంలో సాంకేతిక లోపం తలెత్తి అది విఫలమైంది. అనంతరం 1994 అక్టోబరు 15న పీఎ్‌సఎల్వీ-డీ2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. అక్కడి నుంచి ఇస్రో వరుసగా 39 విజయాలు సాధించింది. 2017 ఆగస్టు 31న పీఎ్‌సఎల్వీ-సీ39 రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈ వైఫల్యం తర్వాత 8 ఏళ్లలో పీఎ్‌సఎల్వీ ద్వారా చేపట్టిన 21 రాకెట్ ప్రయోగాలు వరుసగా విజయం సాధించాయి. తాజాగా పీఎ్‌సఎల్వీ-సీ61 మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం విఫలమైంది.
ఇస్రో జైత్రయాత్రకు బ్రేక్
ఎనిమిదేళ్లుగా 58 విజయాలతో ఇస్రో విజయపరంపర కొనసాగిస్తోంది. 2017 నుంచి ఈ ఏడాది జనవరి 29 వరకు... పీఎ్‌సఎల్వీ, జీఎ్‌సఎల్వీ, ఎస్‌ఎ్‌సఎల్వీ, గగన్‌యాన్-డీ1, ఆర్‌ఎల్‌వీ-టీడీ ఇలా వరుసగా 58 ప్రయోగాల్లో విజయం సాధించింది. ఈ సక్సె్‌సతో భారత్ అంతరిక్ష పరిశోధనల్లో అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ఇందులో చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1, గగన్‌యాన్-డీ1 వంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేశ రక్షణ, సైనిక అవసరాలు, సరిహద్దుల్లో నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడం కోసం ఈవోఎస్-09ను పంపేందుకు ఆదివారం ఇస్రో చేపట్టిన పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్ విఫలమవడంతో వరస విజయాలకు బ్రేక్ పడింది.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి