IndiGo-Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నేడు అర్ధరాత్రి వరకూ ఇండిగో దేశీయ విమాన సర్వీసుల రద్దు
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:06 PM
ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరాల్సిన ఇండిగో విమానాలు అన్నీ నేటి అర్ధరాత్రి వరకూ రద్దయినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అయితే, మధ్యాహ్నం మూడు గంటల వరకే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్టు డీజీసీఏ వర్గాలు తెలిపాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు పర్వం కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరాల్సిన ఇండిగో దేశీయ విమాన సర్వీసులు అన్నీ రద్దయినట్టు ఎయిర్‌పోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. కానీ మధ్యాహ్నం మూడు గంటల వరకే ఫ్లైట్ క్యాన్సిలేషన్‌లు ఉంటాయని డీజీసీఏ వర్గాలు తెలపడంతో ప్రయాణికుల్లో తికమక పెరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (Delhi Airport - IndiGo Flight Cancellations).
ఇండిగో సేవలు అందుబాటులో లేక, ప్రత్యామ్నాయ ఎయిర్‌లైన్స్ టిక్కెట్ల ధరలు అమాంతంగా పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. వేల మంది దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. సిబ్బంది కొరత కారణంగా ఇండిగో గత నాలుగు రోజులుగా ఫ్లైట్ సర్వీసులను రద్దు చేస్తోంది. గురువారం ఒక్క రోజే దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో 500 పైచిలుకు ఫ్లైట్‌లు రద్దయ్యాయి.
పైలట్‌ల డ్యూటీ షెడ్యూల్‌కు సంబంధించి నిబంధనల విషయంలో పొరపాటు పడటంతో ఈ పరిస్థితి వచ్చిందని ఇప్పటికే ఇండిగో ప్రకటించింది. క్షమాపణలు కూడా చెప్పింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే, ఫ్లైట్ సర్వీసుల రద్దు మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని కూడా పేర్కొంది. ఇక పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడం అంత ఈజీ కాదని స్వయంగా సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ అంగీకరించారు.
ఇవి కూడా చదవండి:
వందల కొద్దీ విమానాల రద్దు.. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల ఇక్కట్లు
బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మిస్తామన్న తృణమూల్ ఎమ్మెల్యేపై వేటు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి