AI Technology: ఆధునిక టెక్నాలజీలకు భారత్ సై!
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:05 AM
‘ఉద్యోగాల భవిష్యత్తు’ పేరుతో ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ వివరాల్ని వెల్లడించింది.

ఏఐ, రోబోటిక్స్ తదితర టెక్నాలజీల వాడకంలో భారత్ కంపెనీల ముందంజ
2030నాటికి నికరంగా లభించే కొత్త ఉద్యోగాలు 9.2 కోట్లు .. ఏఐతో ఉద్యోగ మార్కెట్లో తీవ్ర మార్పులు
డబ్ల్యూఈఎఫ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కృత్రిమమేధ (ఏఐ), రోబోటిక్స్, అటానమస్ వ్యవస్థలు వంటి అత్యాధునిక టెక్నాలజీలను తమ సంస్థల్లో ప్రవేశపెట్టే విషయంలో భారతీయ పారిశ్రామికవేత్తలు ఇతర దేశాల పారిశ్రామికవేత్తలకన్నా ముందంజలో ఉన్నారు. ‘ఉద్యోగాల భవిష్యత్తు’ పేరుతో ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ వివరాల్ని వెల్లడించింది. సెమీకండక్టర్లు, కంప్యూటింగ్ టెక్నాలజీలను వాడేందుకు భారత్‌లో 35శాతం కంపెనీల అధిపతులు సముఖత వ్యక్తం చేశారని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇది సగటున 20శాతం ఉంది. క్వాంటమ్, ఎన్‌స్ర్కిప్షన్ టెక్నాలజీలను ఉపయోగించుకోవటానికీ భారతీయ పారిశ్రామికవేత్తలు సిద్ధపడుతున్నారు. ఈ టెక్నాలజీల పట్ల 21శాతం మంది ఆసక్తితో ఉన్నారని, ఇది ప్రపంచ సగటు 12శాతం కన్నా చాలా ఎక్కువని నివేదిక పేర్కొంది. భారత్‌లో డేటా, ఏఐ, మెషిన్ లెర్నింగ్, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ రంగాల నిపుణులు గ్లోబల్ ట్రెండ్‌లకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటున్నారని తెలిపింది.
ఏఐ నిపుణుల సంఖ్యను పెంచుకోవడంలో అమెరికా, భారత్ ముందువరుసలో ఉన్నాయని పేర్కొంది. అమెరికాలో వ్యక్తిగతస్థాయిలో ఆసక్తి కొద్ది ఏఐ రంగంలోకి ప్రవేశిస్తున్నారని, భారత్‌లో మాత్రం కార్పొరేట్ కంపెనీలు ముందుండి ఏఐ శిక్షణను ప్రోత్సహిస్తున్నాయని తెలిపింది. రానున్న కాలంలో అవసరమైన శ్రామికశక్తికి 2/3వంతు వాటాను భారత్, సబ్‌సహారన్ ఆఫ్రికా దేశాలే అందజేస్తాయని పేర్కొంది. 2030 నాటికి కొత్తగా 17కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని.. సాంకేతిక మార్పులు, ఆర్థిక భౌగోళిక ఒత్తిళ్లు తదితర కారణాలతో 7.8కోట్ల ఉద్యోగాలు పోతాయని, ఫలితంగా నికరంగా లభించే కొత్త ఉద్యోగాలు 9.2 కోట్లని అంచనా వేసింది. ఇక ఏఐ రంగంలో శరవేగ మార్పులతో క్యాషియర్లు, టికెట్ క్లర్కులు, బిల్డింగ్ కేర్‌టేకర్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ప్రింటింగ్ వంటి ఉద్యోగాలు క్రమంగా కనుమరుగవుతాయని నివేదిక తెలిపింది. వ్యవసాయ, భవన నిర్మాణ కూలీలు, లారీ, ట్రక్కు డ్రైవర్లు, డెలివరీ సర్వీసుఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, నర్సింగ్ ఉద్యోగులు, టీచర్లకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. ఏఐ, బిగ్‌డేటా, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలకు భారీ ఎత్తున డిమాండ్ ఉంటుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి