Share News

అమెరికాలో భారతీయులకు మరో గండం!

ABN , Publish Date - Mar 07 , 2025 | 05:33 AM

అమెరికాలో లక్షలాది మంది భారతీయులు ప్రస్తుతం స్వీయ బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. గతంలో హెచ్‌-4 వీసాపై అమెరికాకు మైనర్లుగా వలస వెళ్లిన వీరికి ఇప్పుడు 21ఏళ్ల వయసు రావడంతో ఆందోళన మొదలైంది.

అమెరికాలో భారతీయులకు మరో గండం!

  • 1.35 లక్షల మందికి స్వీయ బహిష్కరణ ముప్పు

  • హెచ్‌-1బీ వీసాదారుల పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం

న్యూఢిల్లీ, మార్చి 6: అమెరికాలో లక్షలాది మంది భారతీయులు ప్రస్తుతం స్వీయ బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. గతంలో హెచ్‌-4 వీసాపై అమెరికాకు మైనర్లుగా వలస వెళ్లిన వీరికి ఇప్పుడు 21ఏళ్ల వయసు రావడంతో ఆందోళన మొదలైంది. అమెరికా ఇమిగ్రేషన్‌ చట్టాల ప్రకారం ఇకపై వీరంతా హెచ్‌-1బీ వీసాదారులైన తల్లిదండ్రులపై ఆధారపడిన వారిగా అర్హత కోల్పోతారు. హెచ్‌-1బీ వీసాదారుల పిల్లలు డిపెండెంట్‌ వీసాతో అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది. వారికి 21 సంవత్సరాల వయసు వచ్చేవరకూ ఈ వీసా అమలులో ఉంటుంది.


ఆ తర్వాత వీరు మరో వీసా హోదాకు మారడానికి రెండేళ్ల గడువు ఉండేది. అయితే ఇటీవల ఇమిగ్రేషన్‌ విధానంలో వచ్చిన మార్పులు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ నేపథ్యంలో సరళమైన వీసా విధానాలున్న కెనడా, యూకే తదితర దేశాలకు వలస వెళ్లేందుకు పలువురు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో బ్యాక్‌లాగ్‌ భారీగా ఉండటం కూడా భారతీయ వలసదారులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. 2023 మార్చి నాటికి డిపెండెంట్‌ వీసా గడువు ముగింపు దశకు చేరుకున్న భారతీయుల పిల్లలు దాదాపు 1.35 లక్షల మంది వరకూ ఉన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 05:33 AM