Military Strike: పాక్ ఎయిర్‌బేస్‌లపై విరుచుకుపడ్డ భారత్
ABN , Publish Date - May 11 , 2025 | 03:37 AM
డ్రోన్లు, క్షిపణులతో దాడికి ప్రయత్నించిన పాకిస్థాన్ ఆర్మీ స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో భారత మిలటరీ స్థావరాలపై దాడికి ప్రయత్నించగా.. భారత వాయుసేన దీటుగా బదులిచ్చింది.
కీలక ప్రాంతాల్లో క్షిపణులతో దాడి సైనిక స్థావరాలు, రాడార్ స్టేషన్లు, ఆయుధాగారాల ధ్వంసం
శుక్రవారం అర్ధరాత్రి అనంతరం డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాక్ యత్నం
విజయవంతంగా అడ్డుకున్న భారత్
ఎస్ 400 వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాక్ ప్రచారం అవాస్తవం
లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ, మే 10: డ్రోన్లు, క్షిపణులతో దాడికి ప్రయత్నించిన పాకిస్థాన్ ఆర్మీ స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో భారత మిలటరీ స్థావరాలపై దాడికి ప్రయత్నించగా.. భారత వాయుసేన దీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్‌లోని రఫీఖి, మురిద్, చక్లాలా, రహిమ్ యార్ ఖాన్, సుక్కుర్, చునియన్, పర్సుర్, సియాల్‌కోట్‌లో ఉన్న సైనిక స్థావరాలు, రాడార్ స్టేషన్లు, ఆయుధాగారాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లను క్షిపణులతో ధ్వంసం చేసింది. ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వైమానిక దళం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ శనివారం ఉదయం మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్‌లోని పౌర ప్రాంతాలపై పాకిస్థాన్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, లాయిటరింగ్ మ్యునిషన్లతో దాడికి ప్రయత్నించిందని.. భారత్ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని నిర్వీర్యం చేసిందని తెలిపారు. ఉదంపూర్, పఠాన్‌కోట్, ఆదంపూర్, భుజ్ ప్రాంతాల్లోని వాయుసేన స్థావరాలకు స్వల్పంగా నష్టం జరిగిందని వివరించారు. కానీ ఆదంపూర్‌లో ఎస్-400 రక్షణ వ్యవస్థను, సూరత్‌ఘడ్, సిర్సా వాయుసేన స్థావరాలను, నగ్రోటాలోని బ్రహ్మోస్ స్థావరాన్ని ధ్వంసం చేసినట్టు పాక్ దుష్ప్రచారానికి దిగిందని.. దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని స్పష్టంచేశారు. ఇక పాక్ సైన్యం జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని పౌర ప్రాంతాలపై దాడులు చేసిందని విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ తెలిపారు. ఒక ఆస్పత్రి, పాఠశాలపైనా ఈ దాడులు జరిగాయని, ఇది పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ఈ క్రమంలోనే భారత్ దీటుగా బదులిచ్చిందని, పాక్ సైన్యానికి భారీగా నష్టం జరిగిందని వివరించారు.
ఢిల్లీపై క్షిపణి దాడి.. మధ్యలోనే ధ్వంసం
శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సరిహద్దులకు సమీపంలోని కీలక నగరాలపై భారీ దాడులకు పాకిస్థాన్ ప్రయత్నించింది. జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్, పఠాన్‌కోట్, ఉధంపూర్, జలంధర్, ఫిరోజ్‌పూర్, హోషియార్‌పూర్, జైసల్మేర్, బర్మార్ పట్టణాలపై స్వల్ప శ్రేణి ఫతా-1 క్షిపణులు, ఆయుధ డ్రోన్లతో దాడులు చేసింది. ఆ పట్టణాల్లో ప్రజలు ఉదయం పేలుళ్ల చప్పుళ్ల మధ్య నిద్రలేచారు. పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎస్-400, ఆకాశ్ క్షిపణులతో కూడిన భారత గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు అడ్డుకుని ధ్వంసం చేసింది. ముఖ్యంగా పాక్ నుంచి ఢిల్లీ వైపు దూసుకువస్తున్న ఫతా-2 బాలిస్టిక్ క్షిపణిని ఎస్-400 వెంటనే గుర్తించి... పంజాబ్‌లోని సిర్సా ప్రాంతంలో గగనతలంలోనే పేల్చివేసింది. దీంతో.. ఢిల్లీలో అత్యవసర సన్నద్ధతను ముమ్మరం చేశారు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు షెల్టర్లను సిద్ధం చేశారు. జమ్మూకశ్మీర్ నుంచి రాజస్థాన్ వరకు చాలా ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు, క్షిపణులకు సంబంధించిన శకలాలు పడ్డాయి. ప్రఖ్యాత దాల్ సరస్సులో ఓ క్షిపణి కూలిపోయింది.

పాక్ కాల్పుల్లో ఐదుగురు పౌరుల మృతి
ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంట పాక్ సైన్యం విచ్చలవిడిగా శతఘ్నులు, మోర్టార్లతో కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో రాజౌరీ పట్టణ అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్‌కుమార్ థాపా, రెండేళ్ల చిన్నారి ఆయేషా నూర్, మహ్మద్ సాహిబ్ (35), పూంఛ్ సెక్టార్‌లోని కాంగ్రా గల్హుటా గ్రామంలో రషీదా బీ (55), ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని బీదిపూర్ గ్రామంలో అశోక్‌కుమార్ అనే వ్యక్తి మృతి చెందినట్టు జమ్మూకశ్మీర్ అధికారులు ప్రకటించారు. ఈ మూడు చోట్ల పదుల సంఖ్యలో పౌరులు గాయపడినట్టు వివరించారు. మరోవైపు పాక్ కాల్పుల్లో ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో 8 మంది బీఎ్‌సఎఫ్ జవాన్లు గాయపడినట్టు అధికారులు ప్రకటించారు. అదే సమయంలో పాక్‌లోని లూని ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేశామని తెలిపారు.
ఆ ఆరు స్థావరాలు.. పాక్‌కు కీలకం
పాకిస్థాన్‌కు అత్యంత కీలకమైన, కొన్ని ప్రత్యేక అవసరాల కోసం వినియోగించుకునే మిలటరీ స్థావరాలు, ఎయిర్‌బే్‌సలను ఎంచుకుని మరీ భారత్ శనివారం తెల్లవారుజామున దాడి చేసిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. దీనితోనే పాక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలి, వెనక్కి తగ్గేందుకు కారణమైందని పేర్కొన్నాయి. భారత్ దాడి చేసిన పాక్ ముఖ్య స్థావరాలు, వాటి ప్రత్యేకతలేవంటే..
రావల్పిండిలోని చక్లాలా ఎయిర్‌బేస్: పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోని మిలటరీ ఎయిర్‌బేస్ ఇది. యుద్ధ విమానాలు.. ప్రభుత్వాధినేతలు, వీఐపీల రాకపోకలకు దీనిని వినియోగిస్తారు. 1965, 1971 యుద్ధాల వేళ ఈ ఎయిర్‌బేస్ కార్యకలాపాలు పాక్‌కు కీలకంగా నిలిచాయి.
మురిద్ ఎయిర్‌బేస్: పాక్ డ్రోన్ దాడులు, నిఘా కోసం వినియోగించే కీలక ఎయిర్‌బేస్ ఇది. గత రెండు, మూడు రోజులుగా ఇక్కడి నుంచే వందల కొద్దీ ఆయుధ డ్రోన్లను భారత్‌పైకి ప్రయోగించింది.
రఫీఖి ఎయిర్‌బేస్: పాక్ జేఎఫ్-17, మిరేజ్ యుద్ధ విమానాలను, రవాణా హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచే స్థావరం ఇది. అటు జమ్మూకశ్మీర్ నుంచి ఇటు గుజరాత్ వరకు.. వేగంగా చేరుకునేలా మధ్యలో ఉండటం కూడా కీలక అంశం.
రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్: సరిహద్దులకు సమీపంలో, భారత్‌లో ఎక్కువ దూరం దాడులు చేయడానికి వీలుగా ఉన్న పాక్ వైమానిక దళ స్థావరం ఇది.
సుక్కుర్ ఎయిర్‌బేస్: పాక్‌లోని కరాచీ, హైదరాబాద్ నగరాల మధ్య సింధ్ ప్రాంతంలో ఉన్న కీలక స్థావరం ఇది. ఇక్కడ ఎఫ్-16 యుద్ధ విమానాలతో కూడిన ప్రత్యేక దళం సిద్ధంగా ఉంటుంది.
చునియన్ ఎయిర్‌బేస్: లాహోర్‌కు సమీపంలోని ఈ వైమానిక దళ స్థావరం.. పాక్ ప్రధాన ఎయిర్‌బే్‌సలలో ఒకటి. కీలక నిఘా, రక్షణ వ్యవస్థలను ఇక్కడ మోహరిస్తారు.