India Karachi Port Attack: కరాచీ పోర్టు తగలబడిన వేళ
ABN , Publish Date - May 09 , 2025 | 03:38 AM
1971 యుద్ధ సమయంలో భారత్ కిల్లర్ స్క్వాడ్రన్ ద్వారా కరాచీ పోర్టుపై విరుచుకుపడింది. పాక్ నేవీ నౌకలు, ఆయుధ రవాణా నౌకలు నాశనమయ్యాయి.
నాడు బంగ్లా విముక్తి సమయంలో భారత్ దాడి
పశ్చిమ తీరంలో పాక్ నేవీని ఖతం చేసిన మన ‘కిల్లర్ స్క్వాడ్రన్’
స్టైక్స్ క్షిపణులు, బాంబులతో పాక్ ఆయువుపట్టుపై దెబ్బ
ఇప్పుడూ కరాచీ లక్ష్యంగా దాడులు
న్యూఢిల్లీ, మే 8: అరేబియా తీరంలోని కరాచీ పోర్టు పాకిస్థాన్‌కు ఆయువు పట్టు. దాన్ని ఏమాత్రం దెబ్బతీసినా, స్వాధీనం చేసుకున్నా.. గట్టి దెబ్బతగిలినట్టే. ఈ క్రమంలోనే గురువారం రాత్రి కరాచీ పోర్టును భారత్ టార్గెట్ చేసింది. ఇంతకు ముందు బంగ్లాదేశ్ విముక్తి సమయంలోనూ కరాచీపై భారత్ భారీస్థాయిలో దాడులు చేసింది. ప్రస్తుత దాడులు.. నాటి పరిస్థితిని గుర్తుకు తెస్తున్నాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మద్దతు ప్రకటించడంతో.. భారత్‌లోని తొమ్మిది ఎయిర్‌బేస్‌లపై పాకిస్థాన్ దాడి చేసింది. దీనితో భారత్ నేరుగా యుద్ధ రంగంలోకి దిగింది.. ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టింది. తూర్పు పాకిస్థాన్‌గా ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతానికి ప్రస్తుత పాకిస్థాన్‌కు ఉన్న నౌకాపరమైన అనుసంధానాన్ని తెగ్గొట్టేందుకు.. కీలకమైన కరాచీ పోర్టుపై దృష్టిపెట్టింది. దీనిపై అప్పటి వెస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ ఎస్‌ఎన్ కోహ్లీకి ఆదేశాలు వెళ్లాయి. 1971 డిసెంబర్ 4న పశ్చిమ తీరంలోని ముంబై, ఓఖా స్థావరాల్లోని 25వ మిస్సైల్ బోట్ స్క్వాడ్రన్ నుంచి ‘కరాచీ స్ట్రైక్ గ్రూప్’ పేరిట రెండు యుద్ధ నౌకలు, నాలుగు మిస్సైల్ బోట్లు బయలుదేరాయి. పెట్యా క్లాస్‌కు చెందిన కట్చాల్, కిల్టన్ యుద్ధ నౌకలు, ఐఎన్‌ఎస్ నిర్ఘాట్, నిపట్, వీర్ మిస్సైల్ బోట్లు కరాచీ పోర్టుపై దాడికి వెళితే.. మరో మిస్సైల్ బోట్‌ను ద్వారక వద్ద సిద్ధంగా ఉంచారు.
మిస్సైల్ బోట్లలో రష్యన్ తయారీ స్టైక్స్ క్షిపణులను సిద్ధంగా ఉంచారు. కరాచీకి 110 కిలోమీటర్ల దూరంలోకి చేరుకున్న ఈ స్క్వాడ్రన్.. సముద్రంలో గస్తీ కాస్తున్న పాక్ యుద్ధ నౌకలు పీఎన్‌ఎ్‌స ఖైబర్, పీఎన్‌ఎ్‌స ముహఫిజ్‌లను, పాక్ ఆర్మీకి ఆయుధాలను తరలిస్తున్న ఓ వాణిజ్య నౌకను ధ్వంసం చేశాయి. మరికాస్త లోపలికి చొచ్చుకెళ్లి.. కెమరీ చమురు రిఫైనరీపై క్షిపణి దాడి చేశాయి. ఆ వెనకాలే ఆపరేషన్ పైథాన్ పేరిట వచ్చినపీఎన్‌ఎస్ వినాశ్, తల్వార్, త్రిశూల్ యుద్ధ నౌకలు.. పీఎన్‌ఎ్‌స డక్కా యుద్ధ ట్యాంకర్‌ను ధ్వంసం చేశాయి. కరాచీ పోర్టుపై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో కరాచీ పోర్టు తగలబడిపోయింది. పోర్టులో ఉన్న ఎంవీ హర్మట్టన్, ఎంవీ గల్ఫ్ నౌకలు దెబ్బతిన్నాయి. పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)కు ఆయుధాలు, ఇతర రవాణా నిలిచిపోయింది. దీనితో తూర్పు పాకిస్థాన్‌లోని ఆర్మీ లొంగిపోక తప్పలేదు.